విశాఖపట్నం: చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ డేర్ డెవిల్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన స్థితిలో నాథన్ కౌల్టర్ - నీలే వేసిన బంతికి కర్ణ్ శర్మ అంజిలో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ విజయానికి 168 పరుగులు చేయాల్సి ఉండగా ఎనిమిది వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
నాథన్ కౌల్టర్ - నిలే వేసిన చివరి ఓవరు మొదటి బంతికి కర్ణ్ శర్మ ఒక పరుగు చేశాడు. రెండో బంతికి ఆశిష్ రెడ్డి అవుటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో పడింది. మూడు వికెట్లు చేతిలో ఉన్నాయి. మూడో బంతికి శర్మకు ఒక్క పరుగు వచ్చింది. నాలుగో బంతికి ప్రవీణ్ కుమార్ ఒక్క పరుగు తీశాడు. రెండు బంతులకు ఏడు పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. ఐదో బంతిని ఫీల్డర్ బౌండరీ లోపల అద్భుతంగా ఆపడంతో రెండు పరుగులు వచ్చాయి. చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. సిక్శ్ కొట్టడం తప్ప మరో మార్గం లేదు. అయితే చివరి బంతికి కర్ణ్ శర్మ మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ నాలుగు పరుగుల తేడాతో సన్ రైజర్స్‌పై విజయం సాధించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ చివరలో పది బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. అప్పటికి ఆరు వికెట్లు పడిపోయాయి. చివరి ఆరు బంతుల్లో పది పరుగులు చేయాల్సి వచ్చింది. అంజిలో మాథ్యూస్ వేసిన 19వ ఓవరు చివరి బంతిని ఆశిష్ రెడ్డి గాలిలోకి లేపాడు. అది మాథ్యూస్ చేయిని తాకి వెళ్లిపోయింది. ఆ బంతికి రెండు పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవరులో విజయానికి పది పరుగులు చేయాల్సి వచ్చింది.

హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్‌లో బొపారా అత్యధికంగా 41 పరుగులు చేశాడు. చివరలో కర్ణ్ శర్మ (10 బంతుల్లో 19 పరుగులు), ఆశిష్ రెడ్డి (8 బంతుల్లో 15 పరుగులు) గట్టెక్కిస్తారనే అనిపించింది. అయితే, నాథన్ కౌల్టర్ - నీలే తీవ్రంగా దెబ్బ తీశాడు. చివరి ఓవరులో పది పరుగులు చేయాల్సిన స్థితిలో తొలుత ఆశిష్ రెడ్డి అవుట్ కాగా, చివరి బంతికి సిక్స్ బాదబోయి కర్ణ్ శర్మ అవుటయ్యాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయానికి 168 పరుగులు చేయాల్సి వచ్చింది.
అయ్యర్ (60 పరుగులు) క్లాసిక్ బ్యాటింగ్, డుమీనీ (54) దూకుడుతో ఢిల్లీ 167 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ మరోసారి విఫలమయ్యాడు. అతను 13 బంతుల్లో 9 పరుగులు చేసి ఆశిష్ రెడ్డి బౌలింగులో అవుటయ్యాడు.