కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం నాడు షాకిచ్చింది. క్రిస్ గేల్ చెలరేగిపోయి 56 బంతుల్లోనే 96 పరుగులు చేయడంతో, మిగతా బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేయకపోయినా 178 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే బెంగళూర్ చేధించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. గేల్ చెలరేగి ఆడటంతో దానిని బెంగళూరు 19 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి చేధించింది. దురదృష్టవశాత్తు రనౌటైన గేల్ కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. కానీ, బెంగళూరును మూడు వికెట్ల తేడాతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

గేల్ (56 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 96) వీరోచిత ఇన్నింగ్స్‌తో బెంగళూరుకు తొలి విజయాన్ని అందించాడు. సహచరులంతా వెనుదిరుగుతున్నా ఒంటరి పోరాటం చేసిన గేల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఏబీ డివిల్లీర్స్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28) రాణించాడు.
64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్ ఇచ్చిన క్యాచ్‌ను మోర్నె మోర్కెల్ జారవిడవడంతో కోల్‌కతాకు మ్యాచ్ దూరమైంది. గేల్ ఇచ్చిన క్యాచ్‌ను మోర్కెల్ రెండుసార్లు జారవిడిచాడు. అనంతరం గేల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
విజయానికి 10 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన సమయంలో గేల్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో రనౌటయ్యాడు. అయితే చివర్లో హర్షల్ పటేల్ (9 నాటౌట్), అబు నెచిమ్ (5 నాటౌట్) బెంగళూరుకు మరో చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించేశారు.
కోల్‌కతా బౌలర్లలో యూసుఫ్ పఠాన్ రెండు వికెట్లు పడగొట్టగా మోర్కెల్, కరియప్ప, షకీబల్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 177 పరుగులు చేసింది.
కెప్టెన్ గౌతమ్ గంభీర్ (46 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 58) అర్ధ సెంచరీ సాధించగా, చివర్లో ఆండ్రీ రస్సెల్ (17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాబిన్ ఊతప్ప 35 రన్స్ చేశాడు. బెంగళూరు బౌలర్లలో యజ్వేంద్ర చాహల్, అబు నెచిమ్, వరుణ్ ఆరోన్ తలో వికెట్ పడగొట్టారు.