హైదరాబాద్: అంపైర్ కుమార్ ధర్మసేనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ గొడవకు దిగారు. ఈ సంఘటన శుక్రవారంనాడు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపియల్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. జల్లులు పడుతున్నప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించి తుది రెండు ఓవర్లను కొనసాగించడంపై వారు ఈ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగారు.
వర్షం కారణంగా రెండు గంటల 40 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. దాంతో ఆటను 11 ఓవర్లకేసి కుదించారు. పదో ఓవరు వేస్తుండగా చినుకులు పడడం ప్రారంభమైంది. తుది ఓవరు వేసేటప్పుడు వర్షం ఊపందుకుంది. తుది ఓవరు నాలుగో బంతిని కోహ్లీ మిస్ ఫీల్డ్ చేశాడు. వర్షం నీటితో తడిసి బంతి జారిపోయింది. వర్షం పడుతుందనే విషయాన్ని దాంతో కోహ్లీ అంపైర్ దృష్టికి తెచ్చాడు.

వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారిందనే విషయాన్ని అతను అంపైర్ల దృష్టికి తేవడానికి విఫలయత్నం చేశాడు. చివరి ఓవరు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ అంపైర్ ధర్మసేన వద్దకు వెళ్లి - వర్షం పడుతుంటే మ్యాచును ఎందుకు నిలిపేయలేదని ప్రశ్నించాడు. ఢిల్లీకి చెందిన మరో అంపైర్ అనిల్ చౌదరి విరాట్ కోహ్లీని సముదాయించడానికి ప్రయత్నించారు.
ధర్మసేన తీవ్రమైన అసంతృప్తికి గురి కావడం గుర్తించి కూడా విరాట్ కోహ్లీ తన వాదనను ముచలేదు. విరాట్ కోహ్లీకి దినేష్ కార్తిక్ తోడై ధర్మసేనతో వివాదానికి దిగాడు. అయితే, ధర్మసేన ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయాడు.