ముంబై: ఐపీఎల్-8లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ టోర్నమెంట్‌ను ఓటమితో ప్రారంభించి, దాని నుంచి బయటపడడం లేదు. వరుసగా నాలుగో ఓటమిని మూట కట్టుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై చిత్తుగా ఓడింది. ముంబైపై ధోనీ సేన ఆరు వికెట్లతో విజయం సాధించింది.
ముంబై నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని చెన్నై నాలుగు వికెట్లు కోల్పోయి మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 62), బ్రెండన్ మెకల్లమ్ (20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) తొలి వికెట్‌కు 7.2 ఓవర్లలోనే 109 పరుగులు జోడించి చెన్నై విజయానికి పునాది వేశారు.

సురేష్ రైనా (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 నాటౌట్) పని పూర్తి చేశాడు. ముంబై బౌలర్లలో హర్భజన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. 12 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని కీరన్ పొలార్డ్ (30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64), రోహిత్ శర్మ (31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 50) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు.
అంబటి రాయుడు (16 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 29), హర్భజన్ సింగ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 24) రాణించారు. చెన్నై బౌలర్లలో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ఆశీష్ నెహ్రా మూడు, డ్వేన్ బ్రావో రెండు వికెట్లు పడగొట్టారు.
స్మిత్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన మెక్‌కుల్లమ్ అర్థ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో అవుటయ్యాడు. దీంతో 109 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే స్మిత్ కూడా అవుటయ్యాడు. విజయానికింకా 72 బంతుల్లో 69 పరుగులు కావాలి. అప్పటికే చెన్నై విజయం ఖాయమైపోయింది. అయినా ముంబై బౌలర్లు పోరాడారు. కానీ, రైనా అడ్డుపడ్డాడు.
డుప్లెసిస్ (11)తో మూడో వికెట్‌కు 29, ధోనీ (3)తో నాలుగో వికెట్‌కు 22, డ్వేన్ బ్రావో (13 నాటౌట్)తో ఐదో వికెట్‌కు అజేయంగా 23 రన్స్ జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. అనంతరం రోహిత్, హర్భజన్ ఆచితూచి ఆడడంతో 8.1 ఓవర్లకుగానీ జట్టు స్కోరు 50 దాటలేదు. క్రీజులో కుదురుకున్న తర్వాత హర్భజన్ భారీ షాట్లు ఆడాడు. ఆ క్రమంలోనే మోహిత్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు పోయి వికెట్ పారేసుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 9.3 ఓవర్లలో 57/4.
ఆ తర్వాత రోహిత్‌కు పొలార్డ్ జతకలిసిన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. భారీ షాట్లతో విరుచుకుపడిన పొలార్డ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో 3 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన పొలార్డ్ స్కోరును వేగంగా పెంచాడు. మరోవైపు రోహిత్ కూడా ధాటిగా ఆడి 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కానీ, ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. రోహిత్ అవుటైనా పొలార్డ్ మాత్రం రాయుడు అండతో స్కోరుబోర్డును పరిగెత్తించాడు. ఈ క్రమంలో 21 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. రాయుడు కూడా ధాటిగా ఆడడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది.