న్యూఢిల్లీ: తీవ్రమైన ఉత్కంఠ రేపిన మ్యాచులో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓ దశలో ఓటమి తప్పదని భావించిన తరుణంలో దీపక్ హుడా (25 బంతుల్లో 54) మలుపు తిప్పేశాడు. క్రిస్ మోరిస్ (6 బంతుల్లో 13 నాటౌట్), సౌథీ (4 బంతుల్లో 7) కూడా విజయానికి దోహదం చేశారు. ఓపెనర్ రహానే (39 బంతుల్లో 47), చివర్లో ఫాల్క్‌నర్ (11 బంతుల్లో 17) విజయానికి పాటుపడ్డారు.
ఢిల్లీ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ (4/28) శ్రమ నీటి పాలైంది. అమిత్ మిశ్రా 2, మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు శ్రేయాస్ అయ్యర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), మయాంక్ అగర్వాల్ (21 బంతుల్లో 37)తో పాటు డుమిని (38 బంతుల్లో 44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో పూర్తి ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు సాధించింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన యువరాజ్ (17 బంతుల్లో 2 సిక్స్‌లతో 27) ఫర్వాలేదనిపించాడు. మాథ్యూస్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్ 2, తంబే ఓ వికెట్ పడగొట్టారు. హుడాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ప్రథమార్థానికి, ద్వితీయార్థానికి పొంతనే లేదు. తొలి 12ఓవర్ల ఆట చూశాక ఆ జట్టు ఓటమి ఖాయమనే అనిపించింది. అయితే బరోడా యువ క్రికెటర్ దీపక్ హుడా చూపిన తెగువకు ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయారు.
10.4 ఓవర్లలో 78/4తో తడబాటులో ఉన్న రాజస్థాన్‌ను హుడా ఐదో వికెట్‌కు రహానేతో కలిసి 27 బంతుల్లో 52, ఆరో వికెట్‌కు ఫాల్క్‌నర్‌తో కలిసి 18 బంతుల్లో 36 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేకెత్తించాడు. ఇక చివర్లో 18 బంతుల్లో 36 పరుగులు అవసరమైన తరుణంలో ఫాల్క్‌నర్ ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టడం, హుడా ఔటయ్యాక మోరిస్ సిక్స్ బాదడంతో ఆఖరి ఓవర్‌కు కావాల్సిన పరుగులు పన్నెండే. ఈ పరిస్థితుల్లో మోరిస్ నాలుగో బంతికి ఓ ఫోర్, ఆఖరి బంతికి సౌథీ మరో బౌండరీ బాదడంతో రాయల్స్ విజయం సాధించింది.

ఐపీఎల్-8లో ఢిల్లీ డేర్ డెవిల్స్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. కాగా, ఓటమి ఖాయమనుకున్న తరుణంలో అద్భుతంగా పుంజుకున్న రాజస్థాన్ రాయల్స్ టోర్నీలో రెండో విజయంతో ముందంజ వేసింది.