
ఆడతాడా? లేదా?:
మెగా టోర్నీ ప్రపంచకప్ అనంతరం ఎంఎస్ ధోనీ రిటైర్ అవుతాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్-1 నుండి చెన్నై జట్టును విజయవంతగా నడిపిస్తున్న ధోనీ.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడతాడా? లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే తాజాగా ధోనీ స్పందించాడు.

ప్రపంచకప్ మొదటి ప్రాధాన్యత:
మ్యాచ్ అనంతరం భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వచ్చే సంవత్సరం ఐపీఎల్ ప్లాన్స్ ఏంటి అని ధోనీని అడిగాడు. అందుకు ధోనీ స్పందిస్తూ... 'వచ్చే సంవత్సరం ప్లాన్స్ ఇప్పుడే చెప్పలేం. 2019 ప్రపంచకప్ నా మొదటి ప్రాధాన్యత. ఇపుడు నా దృష్టి అంతా ప్రపంచకప్‌పైనే. ప్రపంచకప్ అనంతరం చెన్నై యాజమాన్యంతో మాట్లాడాలి. జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ సహకరిస్తే వచ్చే ఐపీఎల్ కచ్చితంగా ఆడతాను' అని ధోనీ తెలిపాడు.

వెన్నునొప్పి బాధిస్తోంది:
ఈ సీజన్‌లో ధోనీ 15 మ్యాచుల్లో 83.20సగటుతో 416 పరుగులు చేశాడు. అదీకాక జట్టును ముందుండి నడిపించాడు. ఈ సీజన్‌లో బ్యాట్ జులిపించిన ధోనీ.. వచ్చే ప్రపంచకప్‌లో భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ధోనీ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇదొక్కటే కొంచెం కలవరపెట్టే విషయం. ప్రపంచకప్ అనంతరం రిటైర్ అయినా.. ఐపీఎల్‌లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ధోనీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications












