
ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీవ్ర మనోవేదనకు గురయ్యాడని టీమిండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఒక పరుగు తేడాతో ఓడిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఒత్తిడిని నెగ్గి ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుని నాలుగోసారి కప్ సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ మాట్లాడాడు. 'మ్యాచ్ అనంతరం ధోనీతో మాట్లాడుతుంటే నా గుండె బద్దలైంది. ధోనీ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు, గతంలో ధోనీని ఎప్పుడూ అలా చూడలేదు' అని తెలిపారు. 'ఇది అత్యుత్తమ క్రికెట్ ఆడటం కాదు.. ఇది అత్యుత్తమ ఐపీఎల్ ఫైనల్స్ చూడటం' అని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సంజయ్ తన ట్విట్టర్ వేదికగా కూడా షేర్ చేసాడు.
ఇక సంజయ్ వచ్చే సంవత్సరం ఐపీఎల్ ప్లాన్స్ ఏంటి అని ధోనీని అడిగాడు. అందుకు ధోనీ స్పందిస్తూ... 'వచ్చే సంవత్సరం ప్లాన్స్ ఇప్పుడే చెప్పలేం. 2019 ప్రపంచకప్ నా మొదటి ప్రాధాన్యత. ఇపుడు నా దృష్టి అంతా ప్రపంచకప్‌పైనే. ప్రపంచకప్ అనంతరం చెన్నై యాజమాన్యంతో మాట్లాడాలి. జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ సహకరిస్తే వచ్చే ఐపీఎల్ కచ్చితంగా ఆడతాను' అని ధోనీ తెలిపాడు.