Inzamam Ul Haq : కోహ్లీ ఏమాత్రం కాన్ఫిడెంట్‌గా కన్పించలేదు.. టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయంతో ఆశ్చర్యపడ్డా

ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొద్దో గొప్పో టచ్‌లో కన్పించాడు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం కోహ్లీపై విమర్శలు గుప్పించాడు. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన ఆల్‌రౌండ్ మెరుపు ప్రదర్శనలు చేయడంతో భారత్ అయిదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. టీ20 వరల్డ్ కప్ 2021 గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 10వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించగా.. భారత్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ 34బంతుల్లో 35పరుగులు చేశాడు. అయితే తాను ఎదుర్కొన్న రెండో బంతికే థర్డ్ స్లిప్‌లో ఫాకర్ జమాన్‌కు కోహ్లీ దొరికిపోయేవాడే.. అయితే అతను క్యాచ్ మిస్ చేయడంతో కోహ్లీ నిలదొక్కుకోవడానికి ఛాన్సొచ్చింది.

కోహ్లీని అలా చూసి ఆశ్చర్యపోయాను
ఇక కోహ్లీ బ్యాటింగ్ గురించి ఇంజామామ్ ఉల్ హక్ మాట్లాడుతూ.. 'కోహ్లీ మ్యాచ్‌లో చాలా ఒత్తిడితో కన్పించాడు. సాధారణంగా సెట్ బ్యాటర్‌ను ఔట్ చేయడం చాలా కష్టం. అయితే సెట్ అయ్యాక కూడా కోహ్లీ ఏమాత్రం కాన్ఫిడెంట్‌గా కన్పించలేదు. కోహ్లీని అలా చూసి నేను ఆశ్చర్యపోయాను' అని ఇంజమామ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. కోహ్లీ అడపాదడపా బౌండరీలు బాదినా.. అతను గతంలో మాదిరి అగ్రెసివ్ అప్రోచ్ చూపించలేదు. షాట్లలో కాస్త తడబాటు కన్పించింది. పదే పదే బంతి ఎడ్జ్ అయి స్టంప్‌లను మిస్సయింది.

ఆ ముగ్గురు ఉంటే భారత్ డేంజర్
ఇకపోతే భారత ప్లేయింగ్ XI నుంచి ఫస్ట్-ఛాయిస్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్‌ను తొలగించడం పట్ల భారత మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ఇంజమామ్ ప్రశ్నించాడు. ఐపీఎల్ 2022 ద్వారా భారత్‌కు ఫినిషర్ రోల్‌లో దినేష్ కార్తీక్ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. 'భారత జట్టు మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉన్నాయి. ఈ ఆసియా కప్‌లో మిగతా జట్లతో పోలిస్తే ఆ జట్టుకు ఉన్న ప్రధాన సానుకూలాంశం ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటింగ్ లైనపే. ఇక మిడిలార్డర్లో రిషబ్ పంత్‌ను బెంచ్‌కు పరిమితం చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. పంత్, పాండ్యా, జడేజాల కలయిక చాలా డేంజరెస్‌గా ఉంటుంది. కానీ పంత్‌ను ఎందుకు పక్కన పెట్టారో మాత్రం అర్థం కాలేదు. ఏదేమైనా ఇండియా బాగా ఆడింది' ఇంజమామ్ పేర్కొన్నాడు.

పాకిస్థాన్ సెలెక్షన్ కమిటీ చేయాల్సిందిదే
ఇక పాకిస్తాన్ సెలక్షన్ కమిటీకి ఇంజమామ్ పలు సూచనలు చేశాడు. పాక్ జట్టులో నాలుగు, ఐదు స్థానాలకు స్పెషలిస్ట్ బ్యాటర్లను కనుగొనాలని కోరాడు. 'పాక్ సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్ పాక్ మిడిల్ ఆర్డర్ బలపడ్డానికి ఏదైనా చేయాలి. నంబర్ 3 బ్యాటర్ ఫాఖర్ జమాన్ అవుటయ్యాక జట్టు కుప్పకూలుతుంది. పాక్‌కు నం.4, నం.5 స్థానాలకు నిఖార్సైన బ్యాటర్లు అవసరం. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా బాగా సరిపోతారు కానీ.. నంబర్ 4, నంబర్ 5 స్థానాలకు మాత్రం మంచి ప్లేయర్లు కావాల్సిందే' అని ఇంజమామ్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications