యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (డీపీ వరల్డ్ ఐఎల్ టీ20) మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అయితే ఈ లీగ్ లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు. ఐసీసీ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ ఛైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధితో కలిసి.. షార్జా స్టేడియంలో తాజాగా జరిగిన మ్యాచ్ లో సందడి చేశారు.
దుబాయ్ కేపిటల్స్, షార్జా వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను తిలకించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అయితే ఈ వీడియోను చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దానిని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

కాగా, దుబాయ్ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షార్జా వారియర్జ్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దుబాయ్ కేపిటల్స్ మొదట నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. షాయ్ హోప్ (83 నాటౌట్; 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. జట్టులో టాప్ స్కోరర్ గానూ నిలిచాడు. రొవ్‌మెన్ పావెల్ (28), సికిందర్ రజా (27), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (22) పర్వాలేదనిపించారు. షార్జా బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. మిల్లే, ఆదిల్ రషీద్, కరీమ్ జనత్‌లు తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని షార్జా టీమ్.. 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షార్జా బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో (81; 27 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. జాన్సన్ చార్లెస్ (37), ల్యూక్ వెల్స్ (31), జేసన్ రాయ్ (26)లు నిలకడగానే రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో దుష్మంత చమీర మూడు వికెట్లు దక్కించుకున్నాడు.
What a moment! 🤩 Megastar Chiranjeevi graced the Sharjah Cricket Stadium, to watch #DPWorldILT20 alongside Mr. Mubashshir Usmani, ICC Director and Chair of Associates, and Kiran Kumar Grandhi, GMR Group Corporate Chairman. ⚡️🤩#DPWorldILT20 #AllInForCricket #EnterTheEpic… pic.twitter.com/6sCj85qE4C
— International League T20 (@ILT20Official) January 17, 2025