
చెన్నై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'ఇంట్రస్టింట్' అంటూ ఆ ట్వీట్‌కు ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఆదివారం చెన్నైలోని కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విమానంలో వెళ్లిన మోదీ.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో చెన్నై చిదంబరం స్టేడియంపై నుంచి వెళ్లారు. ఈ క్రమంలోనే ఏరియల్ వ్యూ నుంచి తీసిన స్టేడియం ఫోటోను ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. 'చెన్నై స్టేడియంలో జరుగుతున్న రసవత్తరమైన మ్యాచ్‌ను ఆకాశం నుంచి చూశాను' అంటూ మోదీ ట్వీట్ చేశారు.
చెన్నై పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నెహ్రూ స్టేడియానికి వెళ్లి దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్ ఫొటోలకు నివాళులర్పించారు. అడయారులోని ఐఎన్‌ఎస్ కోస్ట్‌గార్డ్ ప్రాంగణానికి చేరుకుని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తమిళనాడులో రూపొందించిన 'అర్జున్ యుద్ధ ట్యాంకు మార్క్-1ఏ'ను సైన్యానికి అప్పగించారు. దీన్ని సైన్యానికి అందజేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. భారత సైన్యాన్ని ప్రపంచంలోనే ఆధునికమైన సైనిక దళాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పని చేస్తూనే ఉంటామని చెప్పారు.
రెండో టెస్టులో టీమిండియా మ్యాచ్‌పై పట్టు సాధించిన సంగతి తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 134 పరుగులకే ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ (5/43) విజృంభించడంతో పర్యాటక జట్టు విలవిల్లాడింది. దీంతో భారత్‌కు 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదివారం ఆట నిలిచిపోయే సరికి 54/1తో నిలిచింది. క్రీజులో రోహిత్ (25), పుజారా (7) ఉన్నారు.
అయితే మూడోరోజు ఆట మొదలైన కాసేపటికే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జాక్ లీచ్ బౌలింగ్‌లో పుజారా (7) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అతని బౌలింగ్‌లోనే ఓపెనర్ రోహిత్ శర్మ (26) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికి లీచ్ బౌలింగ్‌లోనే రిషబ్ పంత్ (8) స్టంప్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఇక 269 రన్స్ ఆధిక్యంలో ఉంది.