
హైదరాబాద్: ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు కొట్టుమిట్టాడుతోంది. జట్టు కూర్పుపై రోజుకో విమర్శతో కోహ్లీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా, ఇప్పుడు మిథాలీ సేన సైతం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్న నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టుకు సూచనలిచ్చేందుకు స్వయంగా సచిన్ బయల్దేరాడు. ముంబైలోని స్టేడియంలో మహిళా జట్టును కలిసి కాసేపు ముచ్చటించాడు. సచిన్‌తో జరిగిన సంభాషణ గురించి కెప్టెన్ మిథాలీ రాజ్ ఇలా అభిప్రాయపడ్డారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సలహాలు క్రీడాకారులకుఎంతో ప్రయోజనకరం అని భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీరాజ్ అన్నారు. 'సచిన్‌తో పరస్పర చర్చ గురించి చెప్పాలంటే అది జట్టుకు, క్రీడాకారిణులకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఆయనకున్న విశేష అనుభవం నుంచి మేమెంతో నేర్చుకోవచ్చు' అని మీడియా ముందు మిథాలీ స్పష్టం చేశారు.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం మహిళల జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. 'ఒత్తిడిని, వైఫల్యాలను ఎలా జయించాలో సచిన్ మాకు చెప్పారు. ఇది క్రీడాకారిణులు కెరీర్‌లో వివిధ పరిస్థితులను ఎదుర్కోనేందుకు ఉపయోగపడుతుంది. సానుకూల దృక్పథంతో దక్షిణాఫ్రికాకు వెళ్లాలని ఆయన మాతో చెప్పారు. అక్కడి పరిస్థితులకు ఆందోళన పడొద్దన్నారు. ప్రశాతంగా ఆడాలని సూచించారు' అని మిథాలీ తెలిపారు.
దక్షిణాఫ్రికాలో ఆడే టీ20 సిరీస్ త్వరలో వెస్టిండీస్‌లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ఉపయోగపడుతుందని మిథాలీ చెప్పారు. జట్టులోకి ఎంపికైన యువ బ్యాటర్ జెమీమాపై మిథాలీ ప్రశంసల వర్షం కురిపించారు. అండర్-19 స్థాయిలో అదరగొట్టిన జెమీమా టీమిండియాలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.