మరికొన్ని రోజుల్లో భారత్-ఇంగ్లాండ్ అయిదు టెస్టుల సిరీస్ జరగనుంది. జనవరి 25న ఉప్పల్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం. మరోవైపు భారత్‌లో భారత్‌ను ఓడించడం ఇంగ్లాండ్‌కు పెనుసవాలుగా మారింది. గత పుష్కరకాలం నుంచి స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్ ఓటమిపాలవ్వలేదు. అజేయ రికార్డును కొనసాగిస్తుంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఆ దేశ మాజీ ప్లేయర్లు కీలక సూచనలు చేస్తున్నారు. అయితే టీమిండియా ప్లేయర్లపై మానసికంగా పైచేయి సాధించి, వారి ఏకాగ్రతను దెబ్బతీయాలని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ పనేసర్ తన దుర్మార్గపు ఆలోచన పంచుకున్నాడు. ముఖ్యంగా సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి ఇగో హర్ట్ చేసేలా చేయాలని తెలిపాడు. గత కొన్నేళ్లుగా భారత్ ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోతున్న విషయాన్ని పదేపదే గుర్తు చేస్తూ అవమానించాలని పనేసర్ పేర్కొన్నాడు.

వన్డే ప్రపంచకప్‌లో పరుగుల వరద పారించిన కోహ్లి దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో కూడా సత్తాచాటిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల్లో 43 సగటుతో 172 పరుగులు చేశాడు. సఫారీ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్ కోహ్లినే. అంతేగాక ఇంగ్లాండ్‌పై కోహ్లి మెరుగైన రికార్డు ఉంది. 28 టెస్టుల్లో 1991 పరుగులు చేశాడు. స్వదేశంలో 1015 పరుగులు సాధించాడు. దీనిలో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లిని మానసికంగా దెబ్బకొట్టాలని ఇంగ్లాండ్ జట్టుకు పనేసర్ సలహా ఇచ్చాడు.
''కోహ్లి ఇగోతో మైండ్ గేమ్ ఆడండి. మానసికంగా దెబ్బ కొట్టండి. అంతేగాక అతడితో టీమిండియా చోకర్స్ అంటూ.. స్లెడ్జింగ్ చేయండి. ఫైనల్స్‌లో ఓటమిపాలవుతుంటారని చెప్పండి. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే, టీ20 ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కానీ టీమిండియా ఐసీసీ ట్రోఫీలో సత్తాచాటలేకపోతుంది. దీంతో కోహ్లి ఏకాగ్రత కోల్పోతాడు'' అని పనేసర్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.