కోల్‌కతా: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీలే తనకు ఆదర్శమని ఆస్ట్రేలియా మహిళా జట్టు వైస్ కెప్టెన్ అలెక్స్ బ్లాక్‌వెల్ చెప్పింది. మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలన్నది వారిద్దరి నుంచే నేర్చున్నట్లు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపింది.
మిడిల్ ఆర్డర్‌లో వస్తే ప్రత్యర్థి బౌలర్లను అసంతృప్తికి లోను చేయడమే మా పని. 360 డిగ్రీల ప్లేయర్‌గా ఉండటమంటే ఇష్టం. స్కేర్ షాట్స్ కొట్టడం తరచూ ఆడటం కొంత ఇబ్బందే. వికెట్ ముందు ఆడేందుకు నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. దీంతో ఒకటి రెండు పరుగులు రాబడతా' అని అలెక్స్ తెలిపింది.
'విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీల ఆట నుంచి నేను చాలా నేర్చుకున్నా. మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలో వారిని చూస్తే తెలుస్తుంది. ఫోర్లు, సిక్సర్లు కొట్టే సత్తా ఉన్నప్పటికీ ఒకటి, రెండు పరుగులు తీయడం కూడా చాలా ముఖ్యం. అందుకు వికెట్ల మధ్య పరుగు తీయాల్సిందే' అని చెప్పింది.

పురుషుల జట్టుతో కలిసి ఆడటమంటే అద్భుతమేనని తెలిపింది. 2009 నుంచి తాము టీ20 ప్రపంచ కప్ ఆడుతున్నట్లు పేర్కొంది. తమ మ్యాచుల్లో కొంత పవర్ తక్కువగా ఉంటుందని, బౌలింగ్‌లో పేస్ తక్కువగా ఉంటుందని తెలిపింది.
అయితే, పురుషుల మ్యాచులతో సమానంగా ఉత్కంఠ ఉంటుందని చెప్పింది. తమ జట్టు భారత పర్యటనలో తమను పురుషులతో సమానంగా చూస్తున్నారని, వారికి ఎలాంటి వసతులు కల్పించారో మాకు కూడా అలాంటి వసతులే కల్పించారని తెలిపారు.
పురుషుల క్రికెట్ వ్యాపార పరంగా చాలా మెరుగ్గా ఉందని, మహిళల క్రికెట్ అంతగా లేదని చెప్పింది. కాగా, కోల్‌కతాలో ఆస్ట్రేలియా మహిళల జట్టు వెస్టిండీస్ మహిళల జట్టుతో టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో తలపడనుంది.