
హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బుధవారం 37వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం రాత్రే యువీ ఓ చిన్నపాటి బర్త్ డే పార్టీని చేసుకున్నాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను యువీ భార్య హాజెల్ కీచ్ తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ పార్టీకి టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నట సాగరిక ఘట్కే కూడా హాజరయ్యారు. యువీకి జహీర్ ఖాన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఫోటోలను సాగరిక తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
కాగా, యువరాజ్ ప్రస్తుతం రంజీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్ పేలవంగా 264 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో.. దేవధర్ ట్రోఫీలో అతనికి సెలక్టర్లు చోటివ్వలేదు.
దీనికి తోడు.. ఇప్పుడు ఐపీఎల్ జట్టు కూడా విడిచిపెట్టడంతో.. ఫామ్ నిరూపించుకుని డిసెంబరులో జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఫ్రాంఛైజీలు దృష్టిలో పడేందుకు ఈ వెటరన్ ఈ ఆల్‌రౌండర్ సిద్ధమైయ్యాడు. ఇందులో భాగంగా ఐపీఎల్ 2019 సీజన్ కోసం కనీస ధరను రూ.కోటికి తగ్గించుకున్నాడు.