కప్ ఇంటికొచ్చేసింది. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణ తెరపడిన అయిదు రోజులకు భారత గడ్డపై చేరుకుంది. ఊహించినట్లుగానే విశ్వవిజేతగా నిలిచిన రోహిత్‌సేనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
విజేతల రాక కోసం అభిమానులు బుధవారం అర్ధరాత్రి నుంచే ఎయిర్‌పోర్టులో ఎదురుచూశారు. కాస్త ఆలస్యంగా వచ్చిన భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు టీమిండియా.. ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచింది. అదిరే స్టెప్పులతో డ్యాన్స్ వేస్తూ భారత ఆటగాళ్లు అలరించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య మాస్ డ్యాన్స్‌తో ఇరగదీశారు.

బార్డబోస్ వేదికగా జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించి భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అయితే భీకర తుఫాను కారణంగా స్వదేశానికి చేరుకోవడానికి టీమిండియాకు ఇన్ని రోజులు పట్టింది. మొత్తంగా బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఎయిర్ ఇండియా ఛార్టర్ ఫ్లైట్ AIC24WCలో భారత్‌కు చేరుకున్నారు. అయితే విమానంలో భారత ఆటగాళ్లు సుమారు 16 గంటల పాటు ప్రయాణించారు.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారత ఆటగాళ్లు రచ్చరచ్చ చేశారు. అంతేగాక కప్‌తో ఎమోషనల్ అయ్యారు. రోహిత్, కోహ్లి, సిరాజ్, చాహల్ తమ భావోద్వేగాన్ని పంచుకున్నారు. కోచ్‌గా తన ఆఖరి మిషన్‌ను విజయవంతంగా ముగించిన రాహుల్ ద్రవిడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విమానంలో టీమిండితో పాటు భారత జర్నలిస్టులు కూడా వచ్చారు. అయితే ఈ ప్రయాణంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు తీయకూడదని, ఇది ప్రైవేట్ పార్టీ అని ముందుగానే తెలియజేశారు.
భారత ఆటగాళ్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు కొందరు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించారు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్, చాహల్ మాత్రం ఎకానమీ సెక్షన్‌లోనూ జర్నీ చేశారు. ప్రయాణానికి సంబంధించిన వీడియోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.