
లఖ్‌నవూ: ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో భారత మహిళల జట్టును ఓడించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. నామమాత్రమైన అయిదో వన్డే ఈనెల 17న జరగనుంది. దక్షిణాఫ్రికా ప్లేయర్స్ సమిష్టిగా రాణించడంతో.. భారత స్టార్ ప్లేయర్ పూనమ్ రౌత్ (104 నాటౌట్; 123 బంతుల్లో 10×4) చేసిన అజేయ శతకం వృథా అయింది. సుదీర్ఘ విరామం తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న సిరీస్ ఇదే.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా (10) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ ప్రియా పునియా (32) పర్వాలేదనిపించింది. పూనమ్ రౌత్ సెంచరీతో (104 నాటౌట్) మెరవగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (45, 71 బంతుల్లో 4 ఫోర్లు) మరోసారి ఆకట్టుకుంది. ప్రొటీస్ బౌలర్ సేఖుఖునే రెండు వికెట్లు పడగొట్టారు.
267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు మరో 8 బంతులు మిగిలివుండగానే 3 వికెట్లకు 269 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ లిజెలీ లీ (69; 75 బంతుల్లో 10×4), కెప్టెన్ లారా వోల్వార్డ్ (53; 78 బంతుల్లో 6×4) హాఫ్ సెంచరీలు చేశారు. ఇద్దరూ కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే స్వల్ప వ్యవధిలో లిజెల్, లారా ఔట్ అవ్వడంతో ప్రొటీస్ కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 18 ఓవర్లలో 121 పరుగులు చేయాల్సిన దశలో లారా గుడ్‌ఆల్ (59 నాటౌట్; 66 బంతుల్లో 6×4), మిగ్నాన్ డు ప్రీజ్ (61; 55 బంతుల్లో 8×4, 1×6) జట్టును విజయతీరాలకు చేర్చారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డుప్రీజ్‌కు దక్కింది.
అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో మహిళా బ్యాటర్‌గా, తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన రెండు రోజుల్లోనే మిథాలీ రాజ్ మరో మైలురాయిని కూడా అందుకుంది. మహిళల వన్డే క్రికెట్లో 7000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా 38 ఏళ్ల మిథాలీ రికార్డు సృష్టించింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డేలో మిథాలీ 26 పరుగులు చేయగానే ఈ రికార్డు అందుకుంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ (5992) రెండో స్థానంలో ఉంది.