
బ్రిస్టోల్: టీమిండియా మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగిన షెఫాలీ.. పిన్న వయసులోనే అన్ని ఫార్మాట్లు ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 2019లో టీ20లలో అడుగుపెట్టిన షెఫాలీ.. ఇంగ్లండ్‌తో ఈ నెల 16-19 మధ్య జరిగిన ఏకైక టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసింది. అప్పటికి ఆమె వయసు 17 ఏళ్ల 150 రోజులు. ఆ టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో 96, రెండో ఇన్సింగ్స్‌లో 63 పరుగులు చేసి అరంగేట్ర టెస్టులో రెండు ఇన్సింగ్స్‌లలోనూ అర్ధ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది.
బ్రిస్టోల్ వేదికగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డేలో బరిలోకి దిగడంతో మూడు ఫార్మాట్లు ఆడిన ఐదో అతిపిన్న క్రికెటర్‌గా, మూడో మహిళా క్రికెటర్‌గా, తొలి విమెన్ క్రికెటర్‌గా షెఫాలీ వర్మ రికార్డు సృష్టించింది. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ముజీబుర్ రెహ్మాన్ 17 ఏళ్ల 78 రోజుల వయసులో మూడు ఫార్మాట్లలోనూ ఆడింది. ఆ తర్వాత ఇంగ్లండ్ మహిళా జట్టు వికెట్ కీపర్ సారా టేలర్, ఆస్ట్రేలియా విమెన్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ, పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ ఆమిర్ ఉన్నారు. ఈరోజు ఆ జాబితాలో షెపాలీ వర్మ చేరింది.
ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ టార్గెట్ నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ కెప్టెన్ మిథాలీ రాజ్ వీరోచిత ఇన్సింగ్స్‌తో భారత్ 200 పరుగుల మైలు రాయిని దాటింది. వికెట్లు టపటపా రాలుతున్నా క్రీజునే అంటిపెట్టుకున్న మిథాలీ.. పూనమ్ రౌత్ (32), దీప్తి శర్మ (30)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నిర్మించింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మరింత దూకుడు పెంచింది. ఈ క్రమంలో భారీ షాట్‌కు యత్నించి బౌల్డ్ అయింది. మొత్తం 108 బంతులు ఎదుర్కొన్న మిథాలీ 7 ఫోర్లతో 72 పరుగులు చేసింది.
టీమిండియా బ్యాటర్లలో స్మృతి మంధాన 10, షెఫాలీ వర్మ 15, హర్మన్‌ప్రీత్ కౌర్ 1, పూజా వస్త్రాకర్ 15, తానియా భాటియా 7 పరుగులు చేయగా, శిఖా పాండే (3), ఝులన్ గోస్వామి (1) నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ మూడు వికెట్లు పడగొట్టగా, కేథరిన్ బ్రంట్, అన్యా శ్రుభ్‌సోల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కేట్ క్రాస్‌కు ఓ వికెట్ దక్కింది.