
వొర్సెస్టర్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మిథాలీ సరికొత్త చరిత్ర సృష్టించారు. శనివారం ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో మిథాలీ (75 నాటౌట్; 86 బంతుల్లో 8x4) పరుగులు చేసి.. అన్ని ఫార్మాట్లలో కలిపి 10337 పరుగులు సాధించారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ (10273) ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్‌గా ఉన్నారు. ఆమెను దాటేందుకు మిథాలీకి శనివారం నాటి ఇన్నింగ్స్‌లో 12 పరుగులు అవసరం అయ్యాయి. అయితే తనకింకా పరుగుల దాహం తీరలేదని మిథాలీ తెలిపారు.
మ్యాచ్ అనంతరం మిథాలీ రాజ్ మీడియాతో మాట్లాడుతూ... 'నా క్రికెట్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఎన్నో ఒడుదొడుకులు.. సవాళ్లను ఎదుర్కొన్నా. చాలాసార్లు ఆటకు వీడ్కోలు చెప్పాలనుకున్నా. కానీ ఏదో విషయం ఆటలో నన్ను ముందుకు సాగేలా చేసింది. దాంతో ఇలా 22 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నా. ఇప్పటికీ నాకు పరుగులు చేయాలనే దాహం తీరలేదు. భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించాలనుకుంటున్నా. ఇక నా బ్యాటింగ్‌లోనూ కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని తెలుసు. ఇప్పుడు వాటిమీదే దృష్టిసారించాను' అని అన్నారు.
'మూడో వన్డేలో ఆల్‌రౌండర్ స్నేహ రాణా బాగా ఆడింది. ఏడో స్థానంలో ఆమె లాంటి క్రికెటర్ గురించే మేము ఎదురుచూశాం. స్నేహ (24; 22 బంతుల్లో 3x4)తో నెలకొల్పిన అర్ధ శతక భాగస్వామ్యం చాలా విలువైంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఫామ్ కోల్పోతుంటారు. హర్మన్ ప్రీత్‌కౌర్ ప్రస్తుతం అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటుంది. అయితే ఒక జట్టుగా అలాంటి క్రికెటర్లకు అండగా ఉంటామని భరోసా కల్పించాలి. అప్పుడే మళ్లీ గాడిలో పడతారు' అని మిథాలీ రాజ్ అన్నారు.
ఇక ఇంగ్లండ్‌తో ఆడిన వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు 2-1 తేడాతో కోల్పోయినప్పటికీ.. మూడో మ్యాచ్‌లో గెలవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కెప్టెన్ మిథాలీ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే టీ20 సిరీస్‌లో మరింత పట్టుదలగా పోరాడేందుకు ఈ విజయం స్ఫూర్తి నింపుతుందన్నారు. మిథాలీ భారత్ తరఫున 11 టెస్టులు, 217 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 669, వన్డేలలో 7304, టీ20లలో 2364 పరుగులు చేశారు. మొత్తంగా 8 సెంచరీలు చేశారు.