భారత క్రికెట్ అభిమానులకు ఆదివారం వరుసగా చేదు వార్తలే. అబ్బాయిలో బాటలోనే అమ్మాయిలు పయనించారు. భారత పురుషుల జట్టు ఓటమి చవిచూసిన కొన్ని గంటల్లోనే మహిళల జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా ఉమెన్స్‌తో జరిగిన రెండో వన్డేలో భారత అమ్మాయిల జట్టు 122 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 371 పరుగుల భారీ స్కోరు చేసింది. జార్జియా వోల్స్ (101; 87 బంతుల్లో, 12 ఫోర్లు), ఎలీసా పెర్రీ (105; 75 బంతుల్లో, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు శతకాలు బాదారు. ఓపెనర్ ఫోబే లిచ్‌ఫీల్డ్ (60; 63 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ బెత్ మూనీ (56; 44 బంతుల్లో, 8 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. భారత బౌలర్లలో సైమా ఠాకూర్ (3/62) మూడు వికెట్లు, మిన్ను మణి (2/71) రెండు, ప్రియా మిశ్రా (1/88), దీప్తి శర్మ (1/59), రేణుకా ఠాకూర్ సింగ్ (1/78) తలో వికెట్ తీశారు.

అనంతరం భారీ ఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 44.5 ఓవర్లలో 249 పరుగులకే ఆలౌటైంది. రిచా ఘోష్ (54; 72 బంతుల్లో, 8 ఫోర్లు), మిన్ను మణి (46; 45 బంతుల్లో, 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (43; 39 బంతుల్లో, 5 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38; 42 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్‌లాండ్ నాలుగు వికెట్లు, మేఘన స్కట్, కిమ్ గార్త్, గార్డెనర్, సోఫీ, అలనా తలో వికెట్ తీశారు.
ఇప్పటికే తొలి వన్డేలో ఓటమిపాలైన భారత మహిళల జట్టు ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. మరోవైపు అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత పురుషుల జట్టు 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది.