భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా చివర్లో విండీస్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 159/5 స్కోరు చేసింది. తొలి మ్యాచులో 149 పరుగులు ఛేజ్ చేయడంలో విఫలమైన భారత్‌కు ఇది పెద్ద సవాలే అని చెప్పాలి.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి విండీస్ బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడిన ఈ టీం 55 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్ (25) అవుటయ్యాడు. ఆ తర్వాత జాన్సన్ చార్లెస్ (12)ను కుల్దీప్ అవుట్ చేశాడు.

ఇక మళ్లీ వికెట్ పడకుండా పూరన్ (20), బ్రాండన్ కింగ్ (42) మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని 15వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ విడగొట్టాడు. ఇద్దర్నీ ఒకే ఓవర్లో అవుట్ చేసి భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఈ ఓవర్ తర్వాత మ్యాచ్ నెమ్మదిగా భారత్ వైపు మొగ్గిందని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఆ తర్వాత ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మెయర్ (9) కూడా భారీ షాట్లు ఆడకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో ఆ టీం ఆశించిన స్కోరు చేయలేదని అనిపించింది. అయితే చివర్లో విండీస్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ (19 బంతుల్లో 40 నాటౌట్) చెలరేగాడు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ వేసిన 19వ ఓవర్లో అతను 17 పరుగులు పిండుకున్నాడు.
ఇక చివరి ఓవర్లో మరో 11 పరుగులు వచ్చాయి. చివరి ఐదు ఓవర్లలో విండీస్ బ్యాటర్లు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఏకంగా 53 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి, భారత్ ముందు టఫ్ టార్గెట్ నిలిపింది. భారత బౌలర్లలో కుల్దీప్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముఖేష్, అక్షర్ చెరో వికెట్ తీసుకున్నారు.