రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఉంది. వెస్టిండీస్‌తో ఈ టీం ఇక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయం చెప్పాడు. తను ఇక్కడ కచ్చితంగా విండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌ను కలుస్తానన్నాడు. తమ టీం జమైకాలో ఉన్నప్పుడు అందర్నీ గేల్ తన ఇంటికి పిలుస్తుంటాడని గుర్తుచేసుకున్నాడు.
ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడిన గేల్, కోహ్లీ ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. 'క్రిస్ గేల్‌తో నేను చాలా కాలం కలిసి ఆడా. మేం జమైకా వెళ్తే.. అక్కడ క్రిస్‌ను కచ్చితంగా కలుస్తామని అనుకుంటున్నా. తను ఎప్పుడూ మా టీంను ఇంటికి పిలుస్తూ ఉంటాడు. అక్కడ మేమంతా చిల్ అవుతాం. ఈసారి కూడా తను కచ్చితంగా అదే పని చేస్తాడని అనుకుంటున్నా. అందరికీ అతనంటే చాలా ఇష్టం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

'మేం చివరగా ఇక్కడకు వచ్చినప్పుడు కూడా క్రిస్ ఇంటికి వెళ్లాం. తను చాలా మంచి మనిషి. వాళ్ల ఇంట్లో టైం చాలా ఎంజాయ్ చేస్తాం. తను ఫ్రీగా ఉండి, సిటీలోనే ఉంటే.. తనను కచ్చితంగా కలుస్తాం' అని కోహ్లీ అన్నాడు. అలాగే వెస్టిండీస్‌లో తన ఫేవరెట్ మెమరీ ఏంటని అడగ్గా.. తను ఇక్కడే టెస్టుల్లో తన తొలి డబుల్ సెంచరీ బాదిన విషయాన్ని గుర్తుచేశాడు. ఆంటిగ్వాలో వివియన్ రిచర్డ్స్ చూస్తుండగా ఆ ఫీట్ సాధించడం తన ఫేవరెట్ ఫీట్ అని చెప్పాడు.
ఆ మ్యాచ్‌లో ఇండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాని గురించి చెప్పిన కోహ్లీ.. 'నా ఫేవరెట్ మెమరీ కచ్చితంగా ఆంటిగ్వానే. టెస్టు క్రికెట్‌లో నా మొట్టమొదటి డబుల్ సెంచరీ అక్కడే సాధించా. అది కూడా సర్ వివియన్ రిచర్డ్స్ ముందు. అది నాకు చాలా చాలా స్పెషల్ మూమెంట్. అదే రోజు సాయంత్రం వివియన్ రిచర్డ్స్ నన్ను కలిసి కంగ్రాట్స్ చెప్పాడు. అంత కన్నా బెటర్ మూమెంట్ ఇంకేం ఉంటుంది?' అని కోహ్లీ అన్నాడు.