వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు అంతా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ మ్యాచ్ మొదలవనుంది. విండీస్‌లోని డొమినికాలో ఉన్న విండ్‌సోర్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో రాణించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారధి విరాట్ కోహ్లీ, కొత్త కుర్రాడు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి తొలి టెస్టులో టాప్ స్కోర్ చేసే ఛాన్స్ ఎవరికి ఉంది?
విరాట్ కోహ్లీ: 2011-12లో విండీస్ పర్యటనలో భాగంగా డొమినికాలో ఆడిన జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఆ టీంలో ఆడి, ఇప్పుడు మళ్లీ ఇక్కడ ఆడుతున్న ఏకైక ప్లేయర్ అతనే. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు.

అప్పటికి, ఇప్పటికీ కోహ్లీ చాలా మారాడు. అప్పుడు క్రికెట్‌లో తప్పటడుగులు వేస్తున్న అతను.. ఇప్పుడు లెజెండ్‌గా ఎదిగాడు. అంతేకాదు, ఈ ఏడాది టెస్టుల్లో భారత్ తరఫున టాప్ స్కోరర్ అతనే. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ 45 సగటుతో 360 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
టగనరైన్ చందర్‌పాల్: గతేడాది నవంబరులో అరంగేట్రం చేసిన చంర్‌పాల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికి కేవలం ఆరు టెస్టులో ఆడినా.. తనలో చాలా సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో విండీస్ తరఫున టాప్ స్కోరర్ అతనే. ఈ ఏడాది ఏడు ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసిన చందర్‌పాల్ 48.83 సగటుతో 293 పరుగులు చేశాడు. ఆసీస్‌పై రాణించిన అతను ఇండియాపై కూడా అదరగొట్టాలని ఎదురు చూస్తున్నాడు.
రోహిత్ శర్మ: ఇటీవలి కాలంలో రోహిత్ అంత గొప్ప ఫామ్‌లో లేడు. అయితే ఓవరాల్‌గా 2023లో టెస్టుల్లో అతను బాగానే రాణించాడు. ఈ ఏడాది మొత్తం ఐదు మ్యాచులు ఆడిన రోహిత్ 37.50 సగటుతో 300 పరుగులు సాధించాడు. డొమినికాలో బౌలర్లకు కొంత ఎక్స్‌ట్రా బౌన్స్ దొరుకుతుంది. పుల్ షాట్‌ను బాగా ఇష్టపడే రోహిత్‌కు ఈ ఎక్స్‌ట్రా బౌన్స్ నచ్చే అవకాశం ఉంది.

భారీ ఇన్నింగ్స్ ఆడి, తన విమర్శకుల నోళ్లు మూయించాలని రోహిత్ అనుకుంటున్నాడు. కొన్నిరోజుల క్రితం భారత శిబిరంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో రోహిత్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్‌లో అతను రాణించే అవకాశాలు చాలానే ఉన్నాయి.