విండీస్‌తో టెస్టు రెండో రోజు కూడా భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా భారీ శతకంతో జట్టులో తన అరంగేట్రాన్ని మధురానుభవంగా మార్చుకున్నాడు. రెండో రోజు చివరకు కూడా అతను నాటౌట్‌గా నిలిచాడు. మూడో రోజు ఆటలో అతను డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యం లేదు.
అయితే ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను కేవలం ఆరు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా మంచి కంపోజర్ చూపించాడు. రోండో రోజు ఆట ముగిసే సమయానికి 96 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే కోహ్లీ ఇన్నింగ్స్‌లో ఒక విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది.

టెస్టుల్లో అయినా సరే ఎప్పుడూ బౌలర్లపై ఎదురు దాడి చేయడానికే కోహ్లీ ఇష్టపడతాడు. అది కూడా తనకు ఇష్టమైన కవర్ డ్రైవ్ లెంగ్త్‌లో బంతి పడితే దాన్ని బౌండరీకి పంపకుండా వదలడు. అలాంటిది ఈ మ్యాచ్‌లో 80 బంతులు ఆడినా కూడా కోహ్లీ ఒక్క ఫోర్ కూడా బాదలేదు. ఆ తర్వాతి బంతికి తన తొలి బౌండరీ బాదాడు. స్పిన్నర్ వారికన్ వేసిన బంతికి కవర్ డ్రైవ్‌తో బౌండరీకి తరలించాడు.
ఇలా 80 బంతుల తర్వాత కొట్టిన బౌండరీని కోహ్లీ సెలబ్రేట్ కూడా చేసుకోవడం గమనార్హం. గాల్లో పంచ్‌లు విసురుతూ డ్రెస్సింగ్ రూం వైపు చూస్తూ అతను ఈ బౌండరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. వీడియోలో కోహ్లీ కూడా ఈ పని సరదాగా చేసినట్లు కనిపిస్తూనే ఉంది. అవతలి ఎండ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ కూడా కోహ్లీ సెలబ్రేషన్ చూసి నవ్వేశాడు.