వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే భారత బృందం అంతా విండీస్ చేరుకుంది. అక్కడ టీమిండియా స్టార్లు తమ నెట్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నెట్స్‌లో బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో అతను ఆడిన ఒక షాట్ నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా ఎప్పుడూ సంప్రదాయబద్ధమైన క్రికెటింగ్ షాట్లే ఆడే కోహ్లీ.. ఈ ప్రాక్టీస్ సమయంలో మాత్రం అశ్విన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడాడు. అది చూసిన రవీంద్ర జడేజా కూడా దాన్ని ఎంజాయ్ చేశాడు. ఈ సెషన్‌లో కోహ్లీ ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు బౌలర్లను ఎదుర్కోవడం గమనార్హం. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్, అశ్విన్, జడేజాతోపాటు స్థానిక పేసర్‌ను కూడా కోహ్లీ ఎదుర్కొన్నాడు.

ఈ సెషన్‌లో కోహ్లీ మంచి టచ్‌లో కనిపించాడు. అయితే మ్యాచ్‌లో ఇలాంటి డ్రై పిచ్ ఉంటుందని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వెస్టిండీస్ టీంలో పేసర్లు ఎక్కువ. అలాంటప్పుడు వాళ్లు డ్రై పిచ్ ఎందుకు తయారు చేస్తారు? అంతేకాదు, విండీస్‌లో ఉన్న స్పిన్నర్లు అకీల్ హుస్సేన్, రాస్టన్ ఛేజ్ ఇద్దరూ అద్భుతమైన బౌలర్లు. వారి బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడటం కోహ్లీకి కూడా అంత ఈజీ కాదు.
ఈ నెల 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మొదలవుతుంది. డొమినికా వేదికగా జరిగే ఈ టెస్టులో కోహ్లీ రాణించడం చాలా కీలకం. ఎందుకంటే అతను ఆడిన చివరి 11 టెస్టుల్లో కోహ్లీ సగటు 50 కూడా లేదు. అది ఇలాగే కొనసాగితే రెడ్ బాల్ క్రికెట్‌లో అతనికి కూడా సెలెక్లర్లు ఉద్వాసన పలికే అవకాశం ఉంది. అదే సమయంలో విండీస్‌లో కోహ్లీ రికార్డు కూడా అంత బాగలేదు.
కోహ్లీ కనీసం ఐదు టెస్టులు ఆడిన దేశాల్లో రెండో అతి తక్కువ సగటు విండీస్‌లోనే ఉంది. ఇక్కడ ఆడిన టెస్టుల్లో కోహ్లీ సగటు కేవలం 35.62 మాత్రమే. అంతేకాదు, ఓవరాల్‌గా చూసుకున్నా విండీస్‌పై అతని రికార్డు అంత గొప్పగా లేదు. విండీస్‌పై ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడిన అతను 43.26 సగటుతో 822 పరుగులే చేశాడు. అయితే ఈ సిరీసులో రాణించి, డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌ను ఘనంగా మొదలు పెట్టాలని కోహ్లీ ఎదురు చూస్తున్నాడు.