వెస్టిండీస్‌తో రెండో టెస్టులో స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఇలా జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ఆదుకునే విరాట్ కోహ్లీ మరోసారి ఈ మ్యాచ్‌లో తను ఎందుకు స్పెషలో నిరూపించుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. కేవలం బౌండరీలపైనే ఫోకస్ పెట్టకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ ప్రత్యర్థి టీంపై ఒత్తిడి పెంచాడు.
ఇది కోహ్లీ కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ కూడా కావడం గమనార్హం. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లో కోహ్లీ చాలా మంచి టచ్‌లో కనిపించాడు. మరీ రిస్కులు తీసుకోకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అంతకుముందు తొలి టెస్టులో కూడా కోహ్లీ మంచి స్కోరే చేశాడు. ఆ మ్యాచ్‌లో 76 పరుగులు చేసిన అతను దాన్ని సెంచరీగా మలచడంలో విఫలమయ్యాడు.

అయితే ఈసారి చాలా పట్టుదలగా కనిపిస్తున్న కోహ్లీ చూడచక్కని షాట్లతో అలరించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. మంచి డిఫెన్స్ కనబరుస్తూ సాలిడ్ ఆటతో ఆకట్టుకున్నాడు. చాలా ఫోకస్డ్‌గా కనిపించిన అతను వీలు చిక్కినప్పుడల్లా డబుల్స్ తీస్తూ ఫీల్డర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలోనే విండీస్ ప్లేయర్లపై అతను చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
ఇన్నింగ్స్ 72వ ఓవర్ తర్వాత విండీస్ ప్లేయర్లకు తన గురించి కోహ్లీ ఒక మాట చెప్పాడు. '2012 నుంచి డబుల్స్ దొంగిలిస్తున్నా' అంటూ నవ్వేశాడీ మోడ్రన్ గ్రేట్. సింగిల్స్ వచ్చే చోట డబుల్స్ తీస్తూ ప్రత్యర్థి ఫీల్డర్లపై ఒత్తిడి పెంచడం కోహ్లీకి అలవాటే అదే విషయాన్ని అతను మళ్లీ గుర్తుచేశాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కోహ్లీ, జడేజా ఆదుకోవడంతో భారత జట్టు తొలి రోజును 288/4 స్కోరు వద్ద ముగించింది.