తన కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతకు చేరువలో నిలిచాడు. విండీస్‌తో రెండో టెస్టులో బరిలో దిగిన కోహ్లీ.. భారత్ తరఫున 500 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన నాలుగో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అవుటవగానే క్రీజులోకి వచ్చిన కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు.
జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను.. రవీంద్ర జడేజాతో కలిసి కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతేకాదు, తన అసామాన్యమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న కోహ్లీ.. తొలి పరుగు చేయడానికి ఏకంగా 21 బంతులు తీసుకున్నాడు. మొదటి పరుగులు చేయడానికి కోహ్లీ ఎప్పుడూ ఇన్ని బంతులు తీసుకోలేదు. ఇది ఒక విధంగా అరుదైన రికార్డు అని చెప్పాలి.

ఎందుకంటే 2011లో వెస్టిండీస్‌తో బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తొలి పరుగులు చేయడానికి తన కెరీర్‌లోనే అత్యధిక బంతులు తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతను 19 డెలివరీలు ఆడిన తర్వాతే తొలి పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన అతను 21 బంతులు తర్వాత తొలి పరుగులు చేశాడు. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆడాడు.
చూడచక్కని కవర్ డ్రైవ్‌లు, స్ట్రెయిట్ షాట్లతో ప్రేక్షకులను కోహ్లీ అలరించాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 161 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కనుక కోహ్లీ సెంచరీ చేస్తే.. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క బ్యాటర్ కూడా తన 500వ మ్యాచ్‌లో సెంచరీ చేయకపోవడం గమనార్హం.
రెండో రోజు ఆటలో కోహ్లీ 13 పరుగులు చేస్తే ఈ ఘనత సాధించిన వాడవుతాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజాలు 500పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. కానీ వారెవరూ కూడా ఆ మ్యాచ్‌లో సెంచరీ చేయలేకపోయారు. అంతేకాదు, డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచేందుకు కూడా కోహ్లీ చాలా చేరువలో ఉన్నాడు.