వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించేసింది. ఈ లిస్టులో కొత్త మొఖాలకు ప్రాధాన్యం లభించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ భారత్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడే జట్లు ఖరారయ్యాయి. ఈ రెండు సిరీసుల్లో అరంగేట్రం చేసేందుకు కొందరు కుర్రాళ్లు రెడీ అవుతున్నారు వాళ్లు కనుక క్లిక్ అయితే.. జట్టులో స్థానాలు పదిలం అవ్వొచ్చు.
యశస్వి జైస్వాల్ : ఏ ఫార్మాట్‌కు తగ్గట్లు ఆ ఫార్మాట్‌లో ఆడుతూ భారత జట్టులోకి దూసుకొచ్చిన కుర్రాడు యశస్వి జైస్వాల్. దేశవాళీ టెస్టులో 50 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా తన టెక్నిక్ చూపించిన అతను.. ఐపీఎల్‌లో కేవలం 13 బంతుల్లోనే 50 పరుగులు చేసి తనలోని విధ్వంసకారుడిని అందరికీ పరిచయం చేశాడు. పుజారా లేని క్రమంలో ఎడం చేతి టీమిండియా టాపార్డర్‌లో జైస్వాల్ తొలి టెస్టులోనే ఆడే అవకాశం ఉంది. ఎడం చేతి వాటం బ్యాటర్ అవడం కూడా అతనికి కలిసొచ్చే అంశమే.

రుతురాజ్ గైక్వాడ్ : ఐపీఎల్ మెరుపులతో భారత జట్టులోకి దూసుకొచ్చిన మరో ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్. గత ఐపీఎల్‌లో రాణించడంతో అతనికి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఇప్పటి వరకు 9 టీ20లు ఆడిన అతను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఇటీవలి కాలంలో దేశవాళీల్లో కూడా తుఫాన్ ఇన్నింగ్సులు ఆడిన అతను.. విండీస్‌తో టెస్టుల్లో తన అదృష్టం పరీక్షించుకునే ఛాన్స్ ఉంది.
ఇషాన్ కిషన్ : స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ లేని లోటును తీర్చాలంటే అదే మాదిరి విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడే ప్లేయర్ కావాలని, కాబట్టి ఇషాన్ కిషన్‌ను ఆడించాలని చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్నారు. అయితే టీం మేనేజ్‌మెంట్ మాత్రం కేఎస్ భరత్ వైపే మొగ్గు చూపింది. భరత్ ఒక్కటంటే ఒక్క మ్యాచులో కూడా బ్యాటుతో ఆకట్టుకోలేదు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి టెస్టు జట్టుతో ఉన్న కిషన్‌కు విండీస్ టూర్‌లో అవకాశం దక్కొచ్చు.
ముఖేష్ కుమార్ : టీమిండియా ప్రధాన పేసర్ మహమ్మద్ షమీతోపాటు ఉమేష్ యాదవ్ కూడా ఈ సిరీసులో ఆడటం లేదు. ఈ క్రమంలో భారత పేస్ దళంలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. దేశవాళీల్లో అద్భుతంగా రాణించిన ముఖేష్‌కు ఇంతకుముందే టీమిండియా పిలుపు వచ్చింది. కానీ అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఆ అవకాశం కూడా దక్కేలా కనిపిస్తోంది.