వెస్టిండీస్‌తో వన్డే, టెస్టులు ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించినప్పటి నుంచి మాజీలు, ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ ఉన్న ఏడాదిలో మహమ్మద్ షమీ వంటి సీజన్డ్ పేసర్‌ను పక్కన పెట్టడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో షమీకి ఎన్ని మ్యాచులు ఆడితే అంత మంచిదని, దీని వల్ల వన్డే వరల్డ్ కప్‌లో జట్టుకు మంచి జరుగుతుందని అన్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల విశ్రాంతి దొరికింది. షమీకి ఇంకా రెస్ట్ ఇవ్వడం ఏంటని? అతనికి ఎలాంటి గాయాలూ లేనప్పుడు ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. సెలెక్టర్లు ఇలా ఉన్నంత కాలం భారత జట్టు ఐసీసీ ట్రోఫీలు నెగ్గలేదంటూ తిట్టిపోశారు కూడా. కానీ ఈ విషయంలో సెలెక్టర్ల తప్పేం లేదట. షమీనే తనకు మరింత విశ్రాంతి కావాలని అడిగాడట.

తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడినప్పుడే షమీ ఈ రిక్వెస్ట్ చేశాడట. అతను ఇలా తనకు కొంత రెస్ట్ కావాలని అడగ్గానే.. సెలెక్షన్ కమిటీ మరో ఆలోచన లేకుండా అతనికి విశ్రాంతి ఇచ్చారట. వరల్డ్ కప్ ఉన్న ఏడాదిలో షమీ ఫిట్‌గా ఉండటం జట్టుకు ఎంతో కీలకం. అందుకే అతను అడగ్గానే రెస్ట్ ఇచ్చేశారట సెలెక్టర్లు. దానికితోడు విండీస్ పర్యటన తర్వాత టీమిండియా షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉంది.
మరికొన్ని నెలల్లో వరల్డ్ కప్ ఉండటంతో.. దాదాపు అన్ని జట్లు తమ కీ ప్లేయర్లపై బాగా ఫోకస్ పెట్టాయి. వాళ్లు ఈ మెగాటోర్నీకి పూర్తిగా సిద్ధం అయ్యేలా ప్లాన్లు వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎప్పుడూ రెస్ట్ అడగని షమీ విశ్రాంతి అడగడం చూసిన సెలెక్టర్లు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే సాధారణంగానే టీంలో పేసర్లు ఎక్కువ కష్టపడతారు. కాబట్టి వారికి విశ్రాంతి కూడా ఎక్కువ అవసరం అవుతుంది.
ఆసీస్ మాజీ లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా ఇదే విషయం చెప్పాడు. పేసర్లకు విశ్రాంతి చాలా అవసరమని అతను చాలాసార్లు చెప్పాడు. ఐపీఎల్‌లో అన్ని మ్యాచులూ ఆడిన షమీ.. ఆ వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడు. దీంతో బాగా అలిసిపోయిన అతను.. విశ్రాంతి కోరడంలో కూడా తప్పేం లేదు. అసలు విషయం తెలియకుండా సెలెక్టర్లను తిట్టిపోసిన వాళ్లదే తప్పు అన్నమాట.