వెస్టిండీస్‌పై టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో గెలిచింది. అయితే ఈ సిరీసులో మహమ్మద్ షమీ వంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చారు. ఇలా వర్క్ లోడ్ మేనేజ్ చేయడం ఎంత ముఖ్యమో టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వివరించాడు. కేవలం అలా చేయకపోవడం వల్లనే జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పుడు ఆడటం లేదని, అతను లేని లోటు జట్టులో చాలా ఎక్కువగా కనిపిస్తోందని చెప్పాడు.
గతేడాది సెప్టెంబరు నుంచి వెన్నునొప్పి కారణంగా బుమ్రా ఆడటం లేదు. ఈ సంవత్సరం మార్చి నెలలో అతనికి శస్త్రచికిత్స జరిగింది. ఈ క్రమంలో గతేడాది జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్.. దేనిలోనూ బుమ్రా ఆడలేదు. అతని లేని లోటు ఈ అన్ని మ్యాచుల్లో చాలా స్పష్టంగా కనిపించింది. భారత బౌలింగ్ విభాగంలో పదును తగ్గినట్లు అనిపించింది.

ఈ కారణంగానే త్వరలోనే బెంచ్ బలాన్ని పెంచుకొని, బౌలర్లను రొటేట్ చేసుకోవడం గురించి చర్చలు మొదలవుతాయని మాంబ్రే తెలిపాడు. 'చివరి ఒకటి, ఒకటిన్నర సంవత్సరాలు గమనిస్తే.. బుమ్రాను మేం చాలా మిస్ అయ్యాం. అయితే ప్రస్తుతానికైతే ఎవరు వైట్ బాల్ క్రికెట్ ఆడతారు? ఎవరు రెడ్ బాల్ క్రికెట్ ఆడతారు? అని మేం చర్చించలేదు' అని మాంబ్రే తెలిపాడు.
అయితే దీనిపై కచ్చితంగా చర్చ ఉంటుందని, బౌలర్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యమని చెప్పాడు. ఇలా ఒక బౌలర్‌కు విశ్రాంతి ఇస్తే.. వేరే బౌలర్‌ను జట్టులోకి తీసుకుంటామని, ఇలా చేయడం వల్ల బెంచ్ బలం కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. బుమ్రాతోపాటు ప్రసిద్ధ్ కృష్ణ వంటి పేసర్లు కూడా గాయంతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
ఇక బ్యాటింగ్ విభాగంలో కూడా శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో కేవలం బౌలర్ల విషయంలోనే ఈ నిర్ణయం తీసుకుంటారా? లేక బ్యాటర్ల వర్క్‌లోడ్‌ను కూడా టీం మేనేజ్‌మెంట్ సీరియస్‌గా తీసుకుంటుందా? అనేది చూడాలి.