టీమిండియా ఆటగాళ్లు విండీస్‌తో మూడో వన్డే కోసం ట్రినిడాడ్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ దేశ మాజీ దిగ్గజం డ్వేన్ బ్రావోను కలిశారు. టీమిండియా సభ్యులకు ట్రినిడాడ్‌లో బ్రావో ఆహ్వానం పలికాడు. టీం సభ్యులంతా బ్రావోతో నవ్వుతూ మాట్లాడారు. కొందరు వెళ్లి బ్రావో కుమారుడితో కూడా ముచ్చటించారు.
ముఖ్యంగా ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీకి చెందిన రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు. బ్రావో కుమారుడితో కూడా రుతు ముచ్చట్లు చెప్పాడు. జడ్డూ కూడా ఇదే ఫ్రాంచైజీ ప్లేయర్ అని తెలిసిందే. ఇలా టీమిండియా సభ్యులంతా సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ నెట్టింట పంచుకుంది.

'మనం ట్రినిడాడ్‌లో ఉన్నప్పుడు' అనే క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేసింది. ఇక్కడి బ్రయాన్ లారా స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మూడో వన్డేలో తలపడనున్నాయి. తొలి వన్డేలో కష్టపడి నెగ్గిన భారత జట్టు.. రెండో వన్డేలో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. దీంతో మూడో వన్డే ఈ సిరీసులో నిర్ణయాత్మకంగా మారింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందని కూడా తెగ చర్చ జరుగుతోంది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఈ మ్యాచ్‌లో ఆడిస్తారా? లేక రెండో వన్డేలోలాగే పక్కన పెట్టేసి కుర్రాళ్లకు అవకాశం ఇస్తారా? అని చూడాలి. వీళ్లిద్దరూ లేకపోతే టీమిండియా గెలవడం కొంచెం కష్టమే అని నిపుణుల అభిప్రాయం.
వెస్టిండీస్ నుంచి వచ్చిన బెస్ట్ ఆల్‌రౌండర్లలో డ్వేన్ బ్రావో ఒకడు. అతను తన దేశం తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఎంతో సేవ చేశాడు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా ఒక లెజెండ్‌గా ఎదిగాడు.
ఈ పాపులర్ క్రికెట్ లీగ్‌లో 161 మ్యాచులు ఆడిన అతను 161 వికెట్లు తీసుకొని అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లేయర్‌గా పాలు పంచుకోని బ్రావో.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అనుభవం లేని బౌలర్లతో చెన్నై మరో ట్రోఫీ నెగ్గడంలో తెర వెనుక కీలక పాత్ర పోషించాడు.