విరాట్ కోహ్లీ తర్వాత భారత జట్టు పగ్గాలు రోహిత్ శర్మకు అందాయి. కోహ్లీ హయాంలో ఒక్క ఐసీసీ టోర్నీ కూడా నెగ్గలేకపోయిన భారత్.. రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీలు ముద్దాడుతుందని చాలా మంది అనుకున్నారు. దీనికి కారణం ఐపీఎల్‌లో రోహిత్ సక్సెస్. అయితే రోహిత్ కెప్టెన్సీలో కూడా భారత్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. గతేడాది ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైన భారత్.. ఈ ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఓడింది.
ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీ తనను చాలా నిరాశ పరిచిందని బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ తేల్చిచెప్పాడు. ఇప్పటి వరకు రోహిత్ కెప్టెన్సీ తనకు ఏమాత్రం నచ్చలేదన్నాడు. 'నేను రోహిత్ నుంచి ఇంకా మెరుగైన ఫలితాలు ఎక్స్‌పెక్ట్ చేశా. భారత్‌లో గెలవడం కాదు. ఓవర్సీస్‌లో రాణించడమే నిజమైన పరీక్ష. అక్కడే రోహిత్ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది' అని సునీల్ గవాస్కర్ చెప్పాడు.

ఈ టోర్నీలో బ్యాటుతో కూడా రోహిత్ విఫలమయ్యాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో రోహిత్ 28 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలోనే విండీస్ టూర్‌లో టెస్టుల్లో కూడా రోహిత్, కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాల్సిందని, వారి స్థానాల్లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
'డబ్ల్యూటీసీ పోయింది. ఇక తర్వాతి పెద్ద టోర్నీ వన్డే వరల్డ్ కప్. ఇలాంటి టైంలో సీనియర్లకు టెస్టుల్లో పూర్తిగా విశ్రాంతి ఇచ్చేసి ఉంటే సరిపోయేది. వాళ్లను కేవలం 50 ఓవర్ల ఫార్మాట్ ఆడించాలి. కుదిరితే టీ20లు ఆడించినా మంచిదే. వాళ్లు కేవలం వైట్ బాల్ క్రికెట్ మీదనే ఫోకస్ పెడితే బాగుండేది. షమీకి విశ్రాంతి ఇచ్చారు కదా. మిగతా వారి విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సింది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.