వెస్టిండీస్‌తో మూడో వన్డేలో యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీంకు సూపర్ ఆరంభం అందించాడు. ఈ మ్యాచ్‌లో 92 బంతుల్లో 85 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో టీమిండియా 200 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ నెగ్గింది.
ఈ మ్యాచ్‌లో రాణించిన అతను.. తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడాడు. అంతకుముందు ఆడిన రెండు మ్యాచుల్లో గిల్ పెద్దగా రాణించలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్, విండీస్‌తో రెండు టెస్టుల్లో కూడా ఆకట్టుకోలేదు. అయితే మూడో వన్డేలో మాత్రం చెలరేగాడు. ఇది తనకు చాలా స్పెషల్ ఇన్నింగ్స్ అని, కానీ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తానని అనుకున్నానని అన్నాడు.

'ఇది నాకు చాలా స్పెషల్. కానీ నేను భారీ సెంచరీ చేద్దామని అనుకున్నా. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. అయితే మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషిస్తున్నా' అని గిల్ చెప్పాడు. ఈ మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటింగ్ కష్టంగా మారిందన్నాడు. ఆరంభంలో కొంచెం నిదానంగా ఆడిన గిల్.. ఆ తర్వాత నెమ్మదిగా తన స్టైల్‌లో ఆడుతూ టీం భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే సెంచరీ చేయలేక పోయినందుకు బాధ పడ్డాడు.
'ఇది మంచి పిచ్. ఆరంభంలో బంతి చక్కగా బ్యాటింగ్ మీదకు వచ్చింది. కానీ బంతి పాతపడే కొద్దీ బ్యాటింగ్ చేయడం కొచెం కష్టంగా మారింది. లాస్ట్ మ్యాచ్‌లో కూడా నేను సెట్ అయ్యా. మంచి స్కోరు చేస్తానని అనుకున్నా. అందుకే వేగం పెంచడం కోసం ట్రై చేశా. ప్రస్తుతం వన్డేల్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టడం చాలా ముఖ్యం. నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా.. అంతేకానీ ఎవరు ఆడుతున్నారు? ఎవరు ఫెయిల్ అవుతున్నారు? అని పట్టించుకోను' అన్నాడు.