టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ క్రికెట్‌లో తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచులు ఆడటమే అరుదు అనుకుంటే.. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ఇంకా అరుదైన ఘనత అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 500 పైచిలుకు మ్యాచులు ఆడిన ఎవరూ ఈ ఘనత సాధించలేదు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజున కోహ్లీ ఈ మార్కు అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలిరోజు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న కోహ్లీ.. రెండోరోజూ అదే జోరు కొనసాగించాడు. ఈ క్రమంలోనే 180 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి 206 బంతుల్లో 121 పరుగులు చేసిన తర్వాత రనౌట్‌గా వెనుతిరిగాడు. ఇది కోహ్లీకి 76వ అంతర్జాతీయ సెంచరీ. టెస్టుల్లో 29వది.

ఈ క్రమంలోనే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కన్నా తక్కువ ఇన్నింగ్సుల్లో 76 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ నేపథ్యంలో ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సచిన్ కూడా ఈ మైలురాయిపై స్పందించాడు. ఇన్‌స్టాలో కోహ్లీ స్టోరీ షేర్ చేసిన సచిన్.. 'మరో రోజు మరో సెంచరీ చేసిన కోహ్లీ. అద్భుతంగా ఆడావు' అని మెచ్చుకున్నాడు.
ఈ సెంచరీ చేయడం ద్వారా వెస్టిండీస్‌పై వెయ్యి పరుగులను కూడా కోహ్లీ పూర్తి చేసుకున్నాడు. ఇలా కోహ్లీ వెయ్యికిపైగా పరుగులు చేసిన ఐదో దేశం వెస్టిండీస్. ఇంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంకపై కోహ్లీ ఈ ఘనత సాధించాడు. అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్‌ను కూడా కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌తో అధిగమించాడు. అలాగే ఇప్పటి వరకు 2023లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.