ప్రస్తుతం భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటున్న యువ స్టార్ తిలక్ వర్మ. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటిన ఈ యంగ్ ప్లేయర్.. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇలా అరంగేట్రం చేసిన మ్యాచ్ నుంచే చాలా బాధ్యతాయుతంగా ఆడుతూ అందర్నీ ఆకర్షించాడు.
అందుకని అతని ఆటలో మెరుపులు లేవని అనుకుంటే పొరబడినట్లే. తన అంతర్జాతీయ కెరీర్‌ను వరుస సిక్సర్లతో మొదలు పెట్టిన తిలక్.. తన రెండో మ్యాచులోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మూడో మ్యాచ్‌లోనూ అర్ధశతకం సాధించే వాడే. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కక్కుర్తి పడి సిక్సర్ కొట్టేసి మ్యాచ్ ముగించాడు.

ఈ క్రమంలోనే తిలక్ వర్మ గురించి టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. విండీస్‌తో టీ20 సిరీసులో అద్భుతంగా రాణించిన తిలక్‌ను తెగ మెచ్చుకున్నాడు. తిలక్ చాలా ట్యాలెంటెడ్ అని, అంతకుమించి అతనికి పరుగులు చేయాలనే ఆకలి ఎక్కువని కొనియాడాడు. తను చూసిన వారిలో చాలా మెచ్యూర్ ప్లేయర్ అని కితాబిచ్చాడు.
తను ఆడిన తొలి మూడు అంతర్జాతీయ మ్యాచుల్లో తిలక్ వరుసగా 39, 51, 49 నాటౌట్ స్కోర్లతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీసులో లీడింగ్ రన్ స్కోరర్ అతనే కావడం గమనార్హం. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. 'తిలక్ వర్మ చాలా ట్యాలెంట్ ఉన్న ప్లేయర్. తనకు ఆడాలనే ఆకలి చాలా ఎక్కువ. అన్నిటికన్నా ముఖ్యంగా తను చాలా మెచ్యూర్' అని చెప్పాడు.
'నేను ఎప్పుడు తనతో మాట్లాడినా.. తను ఎప్పుడు భారీ షాట్లు ఆడాలి? ఏం చేయాలి? అనే విషయంలో చాలా క్లారిటీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది చాలా అరుదు' అని రోహిత్ మెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. తిలక్‌ను వన్డేల్లో కూడా ఆడించాలని సూచించాడు.