వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయింది. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొన్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ వద్ద బలమైన పేస్ బౌలింగ్ యూనిట్ లేదంటూ బాంబు పేల్చాడు. బలమైన పేస్ బౌలింగ్ యూనిట్ కోసం తాము ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపాడు. చాలా మంది పేసర్లు గాయాల బారిన పడటం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నాడు.
ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. జస్‌ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఉమేష్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కలేదు. వీళ్లు లేకపోవడంతో మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

'వెస్టిండీస్‌లో ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ వికెట్లు పడతాయి. ఆటగాళ్లకు గాయాలయ్యాయి. దీంతో దురదృష్టవశాత్తూ ప్లేయర్లను రొటేట్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే మా వద్ద అంత మంది ఫాస్ట్ బౌలర్లు లేరు. చాలా మంది భారత పేసర్లు గాయాల బారిన పడ్డారు. సో, మా వద్ద ఉన్న వాళ్లను మేం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. మా టీంలో బాగా అనుభవం ఉన్న పేసర్లు ఈ సిరీస్‌కు రాలేకపోయారు' అని రోహిత్ చెప్పాడు.
అయితే ఈ సిరీస్‌కు సెలెక్ట్ చేసిన పేసర్లపై కాన్ఫిడెన్స్ ఉందని రోహిత్ చెప్పాడు. 'జయదేవ్ ఈ టీంకు కొత్త వాడేం కాదు. తను సుమారు 10-12 ఏళ్ల నుంచి ఆడుతున్నాడు. దేశవాళీల్లో ముఖేష్ కుమార్ నిలకడగా రాణిస్తున్నాడు. మేం ఏ కాంబినేషన్‌ను ఆడించొచ్చు అని చూస్తాం. మేం చాలా ఎక్కువ క్రికెట్ ఆడతాం. కాబట్టి వారిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం కష్టం అవుతోంది' అని రోహిత్ అన్నాడు.
'ప్లేయర్లకు సరిపోయినన్ని బ్రేక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాళ్లు ఫ్రెష్‌గా ఉంటారు. అదీకాక, వరల్డ్ కప్ వచ్చేస్తోంది. దాన్ని కూడా మేం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో ఒక సిరీస్‌పై ఫోకస్ పెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఒక విధంగా చూసుకుంటే.. బెంచ్ బలం పెంచుకోవడానికి ఈ సమస్యలన్నీ ఉపయోగపడుతున్నాయి అనుకోవచ్చు' అని పేర్కొన్నాడీ భారత కెప్టెన్.