వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ధాటిగా ఆడుతోంది. ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ ఆటతో జట్టును ముందుండి నడిపించాడు. ఈ క్రమంలో వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంత సంయమనం పాటించాడు.
అదే సమయంలో కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా జోరుగా ఆడాడు. వీళ్లిద్దరూ వన్డే తరహా బ్యాటింగ్‌తో జట్టుకు మంచి స్కోరు అందించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లంచ్ సమయానికి భారత జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 121 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 63 పరుగులు చేయగా.. జైస్వాల్ 56 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ కూడా భారత్‌కు తొలి రోజే భారీ స్కోరు అందించాలని ఆడుతున్నారు.

ఓవర్‌కు సుమారు 5 పరుగుల రన్ రేట్ మెయింటైన్ చేశారీ భారత ఓపెనర్లు. ఇలాగే వీళ్ల ఇన్నింగ్స్ కొనసాగితే భారత్‌కు తొలి రోజు భారీ స్కోరు చేయడం ఖాయం. పిచ్‌పై కొంత తేమ ఉందని, దాన్ని ఉపయోగించుకోవాలనే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నామని టాస్ సమయంలో విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ చెప్పాడు. కానీ రోహిత్, జైస్వాల్ బ్యాటింగ్ చూస్తుంటే అలాంటిదేం లేనట్లే కనిపిస్తోంది. విండీస్ బౌలర్లు వీరిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
అడపా దడపా బౌలర్లు మంచి స్వింగ్ పొందినా.. దాన్ని రోహిత్, జైస్వాల్ ఇద్దరూ ఈజీగానే హ్యాండిల్ చేయగలిగారు. దీంతో విండీస్ బౌలర్లు పూర్తి డిఫెన్స్‌లో పడిపోయారు. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటం వల్లనే భారత ఓపెనర్లు ఇలా ధాటిగా ఆడుతున్నట్లు కొందరు చెప్తున్నారు. వర్షం వల్ల మ్యాచ్ కుదించినా సరే విజయమే లక్షంగా భారత్ ఆడుతోందని నిపుణుల అంచనా.