భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20లో అభిమానులకు ఒక ఆశ్చర్యకర విషయం కనిపించింది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అయితే ఈ టాస్ తర్వాత అనుకోకుండా మ్యాచ్ ఆలస్యమైంది.
ఒక్కోసారి చిన్న చిన్న సమస్యల వల్ల ఇలా మ్యాచ్ ఆలస్యం అవడం పరిపాటే. అయితే ఇక్కడ ఆలస్యమైన కారణం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. ఈ మ్యాచ్ జరిగే స్టేడియంలో 30 యార్డుల సర్కిల్ గీయడాన్ని గ్రౌండ్ స్టాఫ్ మర్చిపోయారు. క్రికెట్ మ్యాచ్‌లో ఈ థర్టీ యార్డ్ సర్కిల్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే.

తొలి పవర్ ప్లేలో ఈ సర్కిల్ అవతల కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే ఉంటారు. మరి అలాంటి ఈ సర్కిల్ లేకపోతే ఎలా? అందుకే ఈ మ్యాచ్ ఆలస్యం అయింది. దీంతో అప్పటికే మైదానంలోకి వచ్చేసి ప్లేయర్లు, అంపైర్లు.. మళ్లీ వెనుతిరగాల్సి వచ్చింది. ఈ వింత ఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్ సమయంలో మౌలిక సదుపాయాల కొరత గురించి ఇటీవలే అశ్విన్ ఎత్తిచూపిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఇలా వింత కారణంతో ఆలస్యం అవడం గురించి కూడా అశ్విన్ తన సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు.
'చాలా యూనిక్ డిలే ఇది. ఇలాంటి కారణాల వల్ల విండీస్‌లో పర్యటించడం అంత ఈజీ కాదు. ఒక క్రికెటర్‌గా ప్రతి ప్లేయర్ నిరంతరం స్విచ్ ఆన్‌లోనే ఉండాలి. అప్పటికీ ఏదో అనుకోని ఘటన జరుగుతుందని భావించి, దానికి రెడీ అవ్వాలి' అని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో అయినా విండీస్ క్రికెట్ మెరుగవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.