టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వన్డే కెరీర్‌పై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అతను ఈ ఫార్మాట్‌కు పనికిరాడని చాలా మందికి అర్థమైపోయింది. అయినా సరే వరల్డ్ కప్ ఆడే టీంలో అతన్ని ఉంచాలని, అతను చాలా టాలెంటెడ్ అని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
అందుకే సూర్యకు ఇవ్వగలిగినన్ని అవకాశాలు ఇస్తోంది. ఈ క్రమంలో మాజీ లెజెండ్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్య వన్డే కెరీర్‌పై క్లారిటీ ఇచ్చేశాడు. విండీస్‌తో జరిగే మూడో వన్డేలో కూడా అతను విఫలమైతే.. ఇక అతన్ని వన్డేలు ఆడించడం అనవసరం అని అభిప్రాయపడ్డాడు.

తన హై-రిస్క్ బ్యాటింగ్‌ను సూర్య మార్చుకోవాలని, వన్డేలకు తగ్గట్లు ఆడాల్సిందని జాఫర్ అన్నాడు. విండీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో సూర్య వరుసగా 19, 24 పరుగులే చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్య వన్డే కెరీర్ గురించి జాఫర్ తన అభిప్రాయం వెల్లడించాడు. మూడో వన్డే అతనికి ఇక చివరి ఛాన్స్ అని స్పష్టం చేశాడు.
'తనకు మూడో వన్డేలో ఇంకొక్క అవకాశం దక్కుతుంది. ఇక అంతే. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తే.. సూర్యకు అవకాశాలు దక్కడం చాలా కష్టం. సూర్య మరీ హై-రిస్క్ గేమ్ ఆడతాడు. బౌండరీలు బాదడానికి ట్రై చేస్తాడు. ఒక్కోసారి ఇలా ఆడటం వల్లనే అతను వికెట్ పారేసుకుంటున్నాడు' అని జాఫర్ వివరించాడు.
సూర్య ఆడే ఈ షాట్లు.. కనెక్ట్ అయినప్పుడు చూసేందుకు చాలా బాగుంటుందని, కానీ వన్డేల్లో ఆడాలంటే కొంత ఓపిక పట్టడం కూడా అవసరమని జాఫర్ చెప్పాడు. 'వన్డే ఫార్మాట్‌లో గేమ్‌ను ఎంత దూరం తీసుకెళ్తే అంత మంచిది. సాధ్యమైనన్ని ఓవర్లు ఆడాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ కూడా అదే చేసేవాళ్లు' అని తెలిపాడు.
'కానీ సూర్య స్వభావం మాత్రం ఇలా రిస్కులు తీసుకునేదే. దాన్ని ఈ ఫార్మాట్‌లో మార్చుకోవాలి. తను ఎదుర్కొనే ప్రతి రెండు లేదాా మూడో బంతికి బౌండరీ బాదడం కుదరదు. అందుకే మంచి స్టార్ట్ లభించినా కూడా.. ఆ తర్వాత తన వికెట్ పారేసుకుంటున్నాడు. దీన్ని ఇప్పటికి చాలాసార్లు చూశాం' అని జాఫర్ విశ్లేషించాడు.