మాజీ లెజెండ్ కపిల్ దేవ్‌పై టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా అసహనం వ్యక్తం చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కపిల్ దేవ్.. భారత ఆటగాళ్లకు మరీ అహంకారం ఎక్కువైందని, అన్నీ తమకు తెలుసునే ధోరణి పెరిగిపోయిందని మండిపడ్డాడు. డబ్బు సంపాదిస్తుండే సరికి వారికి ఈ అహంకారం ఎక్కువైందన్నాడు.
దీనిపై తాజాగా జడ్డూ స్పందించాడు. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టిన జడ్డూ.. కేవలం భారత జట్టు ఒకటి, రెండు మ్యాచులు ఓడిపోయినప్పుడే ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారని అన్నాడు. 'తను ఎప్పుడు ఈ కామెంట్స్ చేశాడో నాకు తెలీదు. సోషల్ మీడియాలో నేను మరీ ఎక్కువ విషయాలు వెతకను. అందరికీ వారి వారి అభిప్రాయాలు ఉంటాయి కదా' అన్నాడు.

'కానీ కపిల్ అన్నట్లు ఏం లేదు. ప్రతి ఒక్కరు తమ గేమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. జట్టులో తమ స్థానాన్ని గ్రాంటెడ్‌గా ఎవరూ తీసుకోవడం లేదు. అవకాశం దొరికిన ప్రతిసారీ.. తమ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు. జట్టు కోసం గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు' అని చెప్పుకొచ్చాడు.
'ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా భారత్ ఒకటి, రెండు మ్యాచులు ఓడిపోయినప్పుడే బయటకు వస్తాయి. ఇక్కడ ఎవరూ యారోగెంట్ కాదు. అందరూ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేకం కష్టపడుతున్నాం. దేశం తరఫున ఆడుతున్నాం. ఇక్కడ ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు' అని జడ్డూ స్పష్టం చేశాడు.
సీనియర్లను ప్రస్తుత టీమిండియా ప్లేయర్లు ఎవరూ కనీసం సలహాలు కూడా అడగడం లేదని సునీల్ గవాస్కర్ అన్నాడు. దీనిపై తాజాగా స్పందించిన కపిల్ దేవ్.. టీమిండియా ప్లేయర్లకు అహంకారం ఎక్కువైందని, తమకు అంతా తెలుసునని అనుకుంటున్నారని చెప్పాడు.
సంపాదన ఎక్కువయ్యే సరికి తాము గొప్ప వాళ్లమనే భావన పెరిగిపోయిందని అన్నాడు. కాగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా రెండో వన్డేలో బరిలో దిగిన భారత జట్టు.. వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. దీంతో మూడో వన్డేలో మళ్లీ వాళ్లిద్దర్నీ ఆడించాలా? వద్దా? అనే ప్రశ్న తలెత్తింది.