విండీస్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా యంగ్ స్టార్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ బదులుగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతను.. ధనాధన్ ఆటతో కేవలం 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అలరించాడు. అతని ఆట చూసిన వాళ్ళందరూ కిషన్ తన బ్యాటింగ్ తో పంత్ ను గుర్తు చేశాడని అన్నారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కిషన్ పెద్దగా రానించలేదు. 37 బంతుల్లో 25 పరుగులు చేసిన తర్వాత చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్ అయితే కిషన్ ను తెగ ట్రోల్ చేశారు కూడా. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ లో అతని ఆట అందరి ప్రశంసలు పొందింది. ఈ మార్పు వెనుక కెప్టెన్ రోహిత్ ప్రోత్సాహం ఉందని కిషన్ వెల్లడించాడు.

"రోహిత్ చాలా అనుభవం ఉన్న కెప్టెన్. కుర్రాళ్లను ఎలా డీల్ చెయ్యాలో తనకు బాగా తెలుసు. ఆటగాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉండేలా చూసుకుంటాడు. ప్రతి ప్లేయర్ తో మాట్లాడతాడు. ఇవన్నీ నేను చాలాసార్లు గమనించా. ప్లేయర్స్ ఒత్తిడిలో పడకుండా చూసుకుంటాడు"అని కిషన్ వివరించాడు. తను బ్యాటింగ్ కు వచ్చే ముందు కూడా రోహిత్ తనకు సలహాలు ఇచ్చాడని తెలిపాడు.
"మైదానంలోకి వెళ్ళే సమయంలో నా ఆటను నమ్ముకోవాలని, ఎవరు ఏమంటున్నా పట్టించుకోవద్దని రోహిత్ చెప్పాడు. ఇలా కెప్టెన్, కోచ్ నమ్మకం ఉందంటే అది కుర్రాళ్లకు పెద్ద ప్లస్ పాయింట్" అని చెప్పుకొచ్చాడు ఈ పాతికేళ్ల వికెట్ కీపర్. అలాగే విరాట్ కోహ్లీ స్థానంలో తను క్రీజులోకి రావడం గురించి కూడా వివరణ ఇచ్చాడు.
పిచ్ పై ఉన్న ప్యాచుల్లో బౌలింగ్ చేస్తూ.. కుడి చేతి వాటం బ్యాటర్లను విండీస్ స్పిన్నర్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని, అందుకే ఎడం చేతి వాటం ప్లేయర్ అయిన తనను ముందుగా పంపారని కిషన్ చెప్పాడు.