వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ ఇటీవలే జట్టును ప్రకటించింది. ఈ బృందంలో స్టైలిష్ బ్యాటర్ సూర్యకుమార్ పేరు కనిపించలేదు. అంతకుముందు భారత్ ఆడిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సూర్యను స్టాండ్‌బై ప్లేయర్‌గా చేర్చారు. ఆసీస్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత బృందంలో సూర్య ఉన్నాడు. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసినా కూడా.. వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకోలేకపోయాడీ ప్రీమియర్ బ్యాటర్.
అయితే విండీస్ టెస్టు సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అసలు అతన్ని టెస్టుల కోసం పరిగణనలోకి తీసుకుంటున్నారా? లేదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఇలా కేవలం సూర్యకుమార్ గురించే కాదు, ఎడం చేతి వాటం పేసర్ అర్షదీప్ సింగ్ భవితవ్యం గురించి కూడా చోప్రా ప్రశ్నించాడు.

విండీస్ టూర్‌కు జట్టును బీసీసీఐ ప్రకటించగానే ట్విట్టర్ వేదికగా తన అనుమానాలు వ్యక్తం చేశాడీ మాజీ ప్లేయర్. 'టెస్టు టీంలో సూర్యకుమార్ పరిస్థితి ఏంటి? ఒకసారి తీసుకుంటారు, ఇంకో సిరీస్‌లో పక్కన పెట్టేస్తారు. అతన్ని టెస్టులకు పరిగణనలోకి తీసుకుంటున్నారా? లేదా? దీనిపై క్లారిటీ కావాలి. ఇక అలాగే వన్డేల్లో అర్షదీప్ సింగ్ ఎందుకు లేడు? అతను ఫిట్‌గా లేడా?' అని ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు.
ఇక బీసీసీఐ ప్రకటించిన జట్టు విషయానికొస్తే.. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు నియమించారు. మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వడంతో కుర్రాడు నవదీప్ సైనీ ఈ సిరీస్‌లో ఆడుతున్నాడు. విండీస్ టూర్‌లో భారత జట్టు రెండు టెస్టులతోపాటు మూడు వన్డేలు, ఐదు టీ20లు కూడా ఆడుతుంది. ఈ పర్యటనలో తొలి టెస్టు విండ్‌సర్ పార్క్‌లో జులై 12న మొదలవుతుంది. ఇక రెండో టెస్టు జులై 20న ప్రారంభం అవుతుంది.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.