వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా పేలవంగా ఆడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుటైన విధానం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. అది చూసిన ఫ్యాన్స్ ఇంత దురదృష్టం ఎవరికీ ఉండదంటున్నారు.
ఈ మ్యాచులో పాండ్యాను నాలుగో స్థానానికి ప్రమోట్ చేశారు. సీనియర్లు రోహిత్, విరాట్ ఇద్దరూ కూడా ఈ మ్యాచులో తమ స్థానాలను కుర్రాళ్ల కోసం త్యాగం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా.. చాలా ఆశ్చర్యకర రీతిలో అవుటయ్యాడు. పెద్దగా స్కోరు చేయకుండా సంగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు.

టీమిండియా ఛేజ్ 14వ ఓవర్లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఆడుతున్నారు. ఈ సమయంలో యానిక్ కరియా వేసిన బంతిని కిషన్ బలంగా బాదాడు. అది కరియా ఎడం చేతి వైపు వెళ్లింది. దాన్ని క్యాచ్ పట్టేయడానికి కరియా డైవ్ చేశాడు. అతను క్యాచ్ మిస్ చేసినా కూడా.. అతనికి తగిలిన బంతి పక్కకు మళ్లి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లకు తగిలింది.
ఆ సమయంలో ఆ క్రీజును దాటిన పాండ్యా చటుక్కున వెనక్కు తిరిగి క్రీజులో బ్యాటు పెట్టాడు. అయితే రిప్లేలో చూస్తే.. పాండ్యా బ్యాటు కేవలం ఒక్క మిల్లీ సెకన్ పాటు నేలను వీడినట్లు కనిపించింది. సరిగ్గా అదే సమయంలో బంతి వికెట్లను కూల్చింది. దీంతో అతను నిరాశగా మైదానం వీడాల్సి వచ్చింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు.
'ఇంత దురదృష్టం ఎవరి దగ్గరా చూడలేదు' అని కొందరు నెటిజన్లు పాండ్యాపై సింపతీ చూపిస్తున్నారు. ఇలాంటి వింత అవుట్ తామెప్పుడూ చూడలేదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఇలా అన్‌లక్కీగా అవుటైన పాండ్యా.. రెండో వన్డేలో అయినా రాణిస్తాడేమో చూడాలి. ఎందుకంటే టీమిండియా భవితవ్యానికి పాండ్యా చాలా కీలకం.