వెస్టిండీస్ చేతిలో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏ విభాగంలోనూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపించింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు ఎవరూ బాధ్యతాయుతంగా ఆడకపోవడం గమనార్హం. ఒకానొక దశలో 90/1 స్కోరుతో పటిష్టంగా కనిపించిన భారత జట్టు కేవలం 181 పరుగులకే కుప్పకూలిందంటేనే.. భారత బ్యాటింగ్ ఏ స్థాయిలో విఫలమైందో అర్థం చేసుకోవచ్చు.

ఇది విండీస్ గడ్డపై ఆరేళ్ల తర్వాత భారత్ ఎదుర్కొన్న తొలి ఓటమి. దీనిపై జట్టు తాత్కాలిక సారధి హార్దిక్ పాండ్యా స్పందించాడు. 'మేం అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు. మొదటి వన్డే కన్నా ఈ మ్యాచ్‌లో పిచ్ మెరుగ్గా ఉంది. గిల్ తప్ప అందరూ ఫీల్డర్లకు డైరెక్టుగా క్యాచులు ఇచ్చి పెవిలియన్ చేరారు' అని అసహనం వ్యక్తం చేశాడు.
'ఈ ఓటమి డిసప్పాయింటింగ్‌గా ఉన్నా కూడా.. దీన్నుంచి చాలా నేర్చుకోవచ్చు. మా ఓపెనర్లు, ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆడిన విధానం చాలా బాగుంది. శార్దూల్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే కార్టీ, హోప్ ఇద్దరూ రాణించి విండీస్‌ను గెలిపించారు' అని పాండ్యా వెల్లడించాడు.
తన ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ.. 'నా శరీరం బాగానే ఉంది. ఇకపై మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తూ.. వరల్డ్ కప్ నాటికి నా వర్క్ లోడ్‌ను కొంచెం పెంచుకోవాలి. నేను ప్రస్తుతం తాబేలు వంటి వాడిని. కుందేలులా మారాలి, వరల్డ్ కప్ నాటికి అంతా సర్దుకుంటుందని అనుకుంటున్నా.' అని చెప్పాడు.
అలాగే ఈ మ్యాచ్ ఓడిపోవడం కూడా ఒక విధంగా మంచిదే అన్నాడు. 'నిజాయితీగా మాట్లాడుకుంటే.. రెండు జట్లు 1-1తో ఉంటేనే చివరి మ్యాచ్ బాగుంటుంది. అప్పుడే ఆ మ్యాచ్ ఛాలెంజింగ్‌గా ఉంటుంది కదా' అని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా అటు బంతితో, ఇటు బ్యాటుతో ఘోరంగా విఫలమయ్యాడు.