విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి ప్లేయర్‌ను పక్కన పెట్టి, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. తాజాగా వీరిలో మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా కూడా చేరాడు.
మ్యాచ్ ముందు టీమిండియా బ్యాటర్ల ఎంపికపై చాలా పెద్ద ప్రశ్న ఉందని చోప్రా అన్నాడు. కిషన్, శాంసన్‌లలో ఎవరిని ఎంచుకుంటారని అందరూ ఆలోచిస్తూనే ఉన్నట్లు తెలిపాడు. 'ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ వచ్చి హాఫ్ సెంచరీ చేయడం వల్ల లాభం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ నిర్ణయం నాకేం అర్థం కాలేదు' అని చోప్రా అన్నాడు.

'ఇషాన్ కిషన్ మంచి ప్లేయర్ అని నాకు ముందే తెలుసు. కిషన్‌ను నాలుగో నెంబర్‌లో ఆడిస్తే.. అతన్నే రెండో వికెట్ కీపింగ్ ఆప్షన్‌గా చూస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కానీ కిషన్‌తో ఓపెనింగ్ చేయించి ఏం లాభం? తను హాఫ్ సెంచరీ చేశాడు సరే. అయితే ఏంటి? అంతకుముందు డబుల్ సెంచరీ బాదలేదా? అలాంటప్పుడు ఇక్కడ హాఫ్ సెంచరీ చేయలేడా?' అని చోప్రా ప్రశ్నించాడు.
అలాగే సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు అతని ఎంపికే ప్రశ్నార్థకంగా మారిందన్నాడు. 'ఇది సూర్యకు చాలా గొప్ప అవకాశం. వరల్డ్ కప్‌లో కూడా అతన్ని ఆడించాలనే నేను అనుకుంటున్నా. కానీ అలా చేయాలంటే ముందు కొన్ని పరుగులు చేయాలి కదా. అలా చేస్తాడనే మూడో నెంబర్‌లో పంపారు' అని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో సూర్య అవుటైన విధానాన్ని కూడా చోప్రా తప్పుబట్టాడు. స్పిన్నర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడిన అతను మొదటి షాట్‌కు ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా మూడు బంతులకు స్వీప్ షాట్ ఆడబోయాడు. మూడో సారి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఇదే విషయం చెప్పిన చోప్రా.. సూర్య ఆట చూసి తాను చాలా డిసప్పాయింట్ అయినట్లు స్పష్టం చేశాడు.