భారత్‌తో తొలి టెస్టును వెస్టిండీస్ అత్యంత దారుణంగా ఆరంభించింది. తొలి రోజు ఆట ముగియడానికి ముందే కేవలం 150 పరుగులకు ఆ టీం ఆలౌట్ అయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న టగనరైన్ చందర్‌పాల్ (12)ను అశ్విన్ ఈజీగా బోల్తా కొట్టించాడు. తను వేసిన మూడో ఓవర్లోనే అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇలాంటి పరిస్థితిలో జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత కెప్టెన్ బ్రాత్‌వైట్ (20)పై పడింది.
అతను మరింత బాధ్యతాయుతంగా ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ అశ్విన్ వేసిన మరో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన బ్రాత్‌వైట్ పెవిలియన్ చేరాడు. ఎక్రాస్ వికెట్స్ వేసిన డెలివరీని లెగ్ సైడ్ భారీ షాట్‌గా మరల్చేందుకు బ్రాత్‌వైట్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో షాట్ సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది.
ఈ బంతి కనీసం థర్టీ యార్డ్ సర్కిల్ కూడా దాటలేదు. ఆఫ్‌సైడ్ ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు చాలా ఈజీ క్యాచ్ దక్కింది. దీంతో విండీస్ జట్టు వెన్నెముకలా ఉన్న ఇద్దరు ఓపెనర్లతను అశ్విన్.. పెవిలియన్ చేర్చినట్లయింది. ఆ తర్వాత జడేజా కూడా రాణించడంతో విండీస్ ఏమాత్రం కోలుకోలేదు.
ఈ ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో విండీస్ కెప్టెన్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ అశ్విన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, కనీసం జాగ్రత్త లేకుండా బ్రాత్‌వైట్ రెక్లెస్ షాట్ ఆడి అవుటవడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఇంత దరిద్రమైన షాట్ ఎవడైనా ఆడతాడా? అంటూ అతన్ని తిడుతున్నారు.

ఇక ఆ తర్వాత కూడా అశ్విన్ ఎక్కడా ఆగలేదు. పిచ్ నుంచి సహకారం అందుతుండటంతో ఒంటిచేత్తో ఆ టీం బ్యాటింగ్ లైనప్‌ను తుత్తునియలు చేశాడు. జడేజా కూడా మూడు వికెట్లతో తన వంతు పాత్ర పోషించాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.