వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు అద్భుంగా ఆడింది. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే చివర్లో విండీస్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ (19 బంతుల్లో 40 నాటౌట్) చెలరేగడంతో ఆ టీం 159 పరుగుల స్కోరు చేసింది.
కొంచెం స్లోగా ఉండి, స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇది టఫ్ టార్గెట్ అనే చెప్పాలి. ఈ ఛేజ్‌లో భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్ కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఇక రాణిస్తాడని అనుకున్న శుభ్‌మన్ గిల్ (6) కూడా విఫలమయ్యాడు.

ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ (83), తిలక్ వర్మ (49 నాటౌట్) కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్య అవుటైన తర్వాత తిలక్ తన ఇన్నింగ్స్ వేగం పెంచాడు. దీంతో అతను వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. చివర్లో విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్లు ఆడటం కష్టంగా మారింది.
దీంతో అతను సింగిల్స్, డబుల్స్‌పై ఆధార పడ్డాడు. అయితే సూర్య అవుటైన తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా మాత్రం భారీ షాట్‌తో ఇన్నింగ్స్ ముగించడానికి పలుసార్లు ప్రయత్నించాడు. కానీ బంతిని సరిగా కనెక్ట్ చేయలేకపోయాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మండిపడ్డారు. అవతలి ఎండ్‌లో తిలక్ 45+ స్కోరుతో ఉన్నాడని, విజయం కూడా ఖాయమైందని ఇలాంటి టైంలో పాండ్యా ఇలా చేయడం ఎందుకని ప్రశ్నించారు.
ఇక చివర్లో తిలక్ 49 పరుగులతో ఉండగా పాండ్యా భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. బంతులు లేకపోతేనో, మరేదైనా కారణం ఉంటేనో పాండ్యా ఇలా చేస్తే ఎవరూ అడిగే వారు కాదు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమీ లేదు.
ఈ క్రమంలోనే గతంలో ధోనీ తన ప్లేయర్ హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు తను భారీ షాట్లు ఆడకుండా అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన వీడియోను నెట్టింట షేర్ చేశారు. ధోనీ ఇలా కుర్రాళ్లను ప్రోత్సహిస్తే.. పాండ్యా ఇలా కక్కుర్తి పడుతున్నాడని అంటున్నారు.
ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ పాండ్యాను తిట్టిపోస్తున్నారు. పాండ్యా కక్కుర్తి పడకపోయి ఉంటే తిలక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునే వాడని అంటున్నారు. రెండో టీ20లో తిలక్ హాఫ్ సెంచరీతో అలరించిన సంగతి తెలిసిందే. మూడో మ్యాచులో కూడా చేసి ఉంటే.. అతను వరుసగా రెండు అర్ధశతకాలు చేసిన ఘనత సాధించేవాడు.