వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీసులో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో కాసేపు మాత్రమే బ్యాటింగ్ చేసిన కిషన్‌కు రెండో టెస్టులో మంచి అవకాశం వచ్చింది. రెండో రోజు ఆటలో కోహ్లీ అవుటైన తర్వాత కిషన్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి టీమిండియా స్కోరు 360/6. దీంతో ఎక్స్‌ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడటానికి కిషన్‌కు ఇదే మంచి ఛాన్స్ అని అంతా అనుకున్నారు.
అయితే కిషన్ మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. అశ్విన్‌తో కలిసి 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అతను.. వ్యక్తిగత స్కోరు 25 వద్ద పెవిలియన్ చేరాడు. ముఖ్యంగా 114వ ఓవర్లో అతను రెండు సార్లు ప్రత్యర్థికి తన వికెట్ తీసుకునే ఛాన్స్ ఇచ్చాడు. మొదట జేసన్ హోల్డర్ వేసిన షార్ట్ బాల్‌ను పుల్ చేసేందుకు కిషన్ ప్రయత్నించాడు. ఇది మిడ్ వికెట్ వైపు గాల్లో వెళ్లగా అక్కడ ఉన్న ఫీల్డర్ ఈ క్యాచ్ నేలపాటు చేశాడు.

ఆ తర్వాత హోల్డర్ బౌలింగ్‌లోనే కిషాన్ అవుటయ్యాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన ఆ బంతిని వన్డే తరహాలో స్లిప్స్ ఫీల్డర్ పక్క నుంచి బౌండరీకి తరలించాలని కిషన్ అనుకున్నాడు. కానీ అతను ఎలాంటి ఫుట్‌వర్క్ చూపించలేదు. ఈ క్రమంలో అతని శరీరానికి బంతి చాలా దగ్గరగా వచ్చేసింది. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ జోషువా డ సిల్వ డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో కిషాన్ పెవిలియన్ చేరాడు.
ఇలా కిషన్ ఫెయిలవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కేఎస్ భరత్‌కు చాలా ద్రోహం జరుగుతోందని అంటున్నారు. ర్యాక్ టర్నర్ పిచ్‌లపై భరత్ అరంగేట్రం చేశాడని, ఆ తర్వాత వరల్డ్ క్లాస్ బౌలింగ్ ఎటాక్ ఉన్న ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడని గుర్తుచేశారు. ఈ మ్యాచుల్లో ఫెయిలవడంతో భరత్‌ను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని, విండీస్‌పై అయితే అతను కూడా రాణించే వాడని అంటున్నారు.
కష్టమైన జట్లపై, పిచ్‌లపై భరత్‌ను ఆడించి అతను ఫెయిలయ్యాడని పక్కన పెట్టడం, ఇప్పుడు సులభమైన పిచ్‌లు, జట్లపై కిషన్‌ను ఆడించడం చూస్తే బీసీసీఐ రాజకీయాలు తెలిసిపోతున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. కనీసం తన రాష్ట్ర జట్టుకు కూడా కీపింగ్ చేయని కిషన్‌ను కీపర్‌గా ఎలా తీసుకున్నారని నిలదీస్తున్నారు. దులీప్ ట్రోఫీలో కూడా కిషన్ ఆడలేదని గుర్తుచేస్తున్నారు.