చివరిదైన ఐదో టీ20లో భారత్‌ను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్.. ఐదు మ్యాచుల సిరీసును 3-2 తేడాతో తమ ఖాతాలో వేసుకుంది. ఇలా టీమిండియాపై టీ20 సిరీస్ గెలవడం వెస్టిండీస్‌కు 17 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. లాడర్‌హిల్ వేదికగా జరిగిన ఐదో మ్యాచ్‌లో భారత జట్టు చాలా పేలవమైన ప్రదర్శన చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయమే టీమిండియాను దెబ్బతీసింది. ఆ సమయంలో పిచ్ నుంచి బౌలర్లకు కొంత సహకారం అందింది. దీంతో టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (9), యశస్వి జైస్వాల్ (5) విఫలమయ్యారు.

ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (61), తిలక్ వర్మ (27) కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. సంజూ శాంసన్ (13) మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 14) కూడా జిడ్డు బ్యాటింగ్ ఆడాడు.
దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్‌తో బరిలో దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (85 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించాడు. మూడో స్థానంలో వచ్చిన నికోలస్ పూరన్ (47) మరోసారి బ్యాటుతో ఆకట్టుకున్నాడు. చివర్లో షాయి హోప్ (13 బంతుల్లో 22 నాటౌట్) లాంఛనం పూర్తిచేశాడు.
ఇలా భారత జట్టు సిరీస్ ఓడిపోవడం చూసిన టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ జట్టుకు మరీ ఎక్కువ హైప్ ఇస్తున్నారని, కానీ లోపల మ్యాటర్ అంత లేదని విమర్శలు చేస్తున్నారు. ఇలా విండీస్ చేతిలో సిరీస్ ఓడిపోవడం భారత జట్టుకు పెద్ద అవమానం అంటూ మండిపడుతున్నారు.