టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మరో మ్యాచ్ ఆడేలా లేడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీసులో భారత జట్టు తడబడుతున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో కష్టపడి విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచులో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఆడలేదు.
అయితే ఈ మ్యాచ్ టాస్ సమయంలో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఈ స్టార్ ప్లేయర్లు ఇద్దరూ చివరి వన్డేలో ఆడతారని స్పష్టం చేశాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే కోహ్లీ ఈ మ్యాచ్ ఆడేలా లేడు. ఎందుకంటే బార్బడోస్ నుంచి ట్రినిడాడ్ వచ్చిన టీమిండియా సభ్యుల్లో కోహ్లీ లేడు. దీంతో అతను ఈ మ్యాచ్ ఆడడేమో? అని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంలో టీం మేనేజ్‌మెంట్ నుంచి అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ కూడా ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లలో జట్టులో కచ్చితంగా ఆడతారు. ఎందుకంటే.. టీమిండియా బ్యాటింగ్‌కు వీళ్లిద్దరూ చాలా కీలకం. ఈ క్రమంలో మిగతా స్థానాల్లో ప్లేయర్లను కన్ఫర్మ్ చేయడానికి మేనేజ్‌మెంట్ రకరకాల ప్రయోగాలు చేస్తోంది.
రెండో వన్డేలో వీళ్లిద్దర్నీ పక్కన పెట్టడం గురించి మాట్లాడిన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఈ ఇద్దర్నీ ఆడించడం వల్ల తమకు కొత్తగా ఎలాంటి సమాధానాలు దొరకబోవని, దాని కన్నా కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదని అభిప్రాయపడ్డాడు. మరి మూడో వన్డేలో కూడా ఇదే చేస్తారేమో చూడాలి. రెండో వన్డేలో బెంచ్‌కే పరిమితమైన కోహ్లీ.. సహచర ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుంటే డ్రింక్స్ కూడా అందించిన సంగతి తెలిసిందే.
కానీ రెండో వన్డేలో భారత జట్టు ఘోర పరాజయం తర్వాత.. కోహ్లీ, రోహిత్‌ను పక్కన పెట్టడం ఎంత పెద్ద తప్పో మేనేజ్‌మెంట్‌కు తెలిసొచ్చింది. వీళ్లిద్దరూ లేకపోతే బాధ్యత తీసుకొని ఇన్నింగ్స్ నిర్మించే ప్లేయర్లే టీంలో లేకుండా పోయారు. ఈ క్రమంలో వీళ్లిద్దర్నీ టీంలో ఆడించకుండా మరోసారి రిస్క్ చేస్తారా? అనేది మరో ప్రశ్న.