వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు టీమిండియా రెడీ అయింది. ట్రినిడాడ్‌లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని బ్రాత్‌వైట్ చెప్పాడు. పిచ్‌పై కొంత తేమ కనబడుతోందని, దాన్ని ఉపయోగించుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని విండీస్ సారధి తెలిపాడు.
ఈ మ్యాచ్ కోసం తమ టీంలో రెండు కీలక మార్పులు చేసినట్లు బ్రాత్‌వైట్ వెల్లడించాడు. షానన్ గాబ్రియెల్ తిరిగి జట్టులో చేరినట్లు చెప్పాడు. అలాగే కిర్క్ మెకెంజీ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. రేమన్ రీఫర్ స్థానంలో మెకెంజీని ఆడిస్తున్నట్లు బ్రాత్‌వైట్ ధ్రువీకరించాడు. తొలి మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా ఫర్వాలేదనిపించామన్నాడు.

తాము క్రమశిక్షణగా ఆడాలని, తొలి టెస్టు ఓటమిని మర్చిపోయి, టీమిండియాలోని క్వాలిటీ బౌలర్లను ఎదుర్కోవాలని అనుకుంటున్నామని చెప్పాడు. తమ రెండు జట్ల మధ్య వైరం ఈ నాటిది కాదని, అయితే ఇటీవలి కాలంలో తాము గెలవలేకపోయామని గుర్తుచేసుకున్నాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారా ఆడుతుంటే చూడటం చాలా సంతోషాన్నిచ్చేదని, అభిమానులకు మరిన్ని జ్ఞాపకాలు అందించాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్లోగా మారుతుందని, కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిదేనని అభిప్రాయపడ్డాడు. జట్టులో ఒకే ఒక మార్పు చేసినట్లు రోహిత్ తెలిపాడు. గజ్జల్లో చిన్న సమస్య రావడంతో శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్ ఆడటం లేదని, అతని స్థానంలో ముఖేష్ కుమార్ అరంగేట్రం చేస్తున్నాడని వెల్లడించాడు.
ఇది వర్షాకాలం మధ్యలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో వరుణ దేవుడు ఎప్పుడైనా మ్యాచ్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఇక పిచ్ విషయానికొస్తే ప్రస్తుతానికి చక్కగా కనిపిస్తోందని, అయితే మ్యాచ్ జరిగే కొద్దీ చాలా పొడిగా మారుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే పిచ్‌పై ఏమాత్రం పచ్చిక లేదని, కాబట్టి స్పిన్నర్లు ఈ పిచ్‌పై రెచ్చిపోతారని తెలుస్తోంది.